గతేడాది ‘పుష్ప 2’తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది మైత్రీ మూవీస్. 2026లో ఈ సంస్థ నుంచి భారీ చిత్రాలు రాబోతున్నాయి. ఈ గ్యాప్లో ‘రాబిన్ హుడ్’ అనే ఓ మీడియం రేంజ్ సినిమాని విడుదల చేశారు. నితిన్ – శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. విడుదలకు ముందు చేసిన వినూత్న ప్రచారాలతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. కాకపోతే… బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కనీసం 20 శాతం రికవరీ కూడా రాలేదని ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి. సినిమాకు కనీసం రూ.50 కోట్ల ఖర్చు తేలింది. ఓటీటీ, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో సగం డబ్బులు తిరిగి వచ్చాయి. అటూ ఇటుగా కనీసం రూ.20 కోట్లయినా ఈ సినిమాతో నష్టపోయినట్టు తెలుస్తోంది. మైత్రీకి రూ.20 కోట్లు పెద్ద నష్టం కాదు. భారీ చిత్రాల మధ్య రొటేషన్లో ఈ సినిమా తాలుకూ నష్టాలు పెద్దగా ఎఫెక్ట్ చేయకపోవొచ్చు. కానీ.. మైత్రీ తాలుకూ నమ్మకాన్ని కాస్త సడలించే ప్రమాదం ఉంది.
ఎందుకంటే మైత్రీ ఈమధ్య అన్నీ భారీ చిత్రాలే నిర్మిస్తోంది. చిన్న, మీడియం సైజు సినిమాలపై ఈ సంస్థ దృష్టి పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. మీడియం రేంజ్ హీరోలతోనూ ప్రాజెక్టులు సెట్ చేయాలన్నది మైత్రీ ఆలోచన. అలాంటి ఐడియాలకు ఇలాంటి ఫలితాలు చెక్ పెడతాయి. `రాబిన్ హుడ్` ఓటీటీల వల్ల సగం రికవరీ అయ్యింది. అది కూడా మైత్రీ లాంటి బ్యానర్ ఉండడం వల్లే. అదే వేరే బ్యానర్ అయితే ఈ మాత్రం రికవరీలు కూడా వెనక్కి రావు. ఈ ఫ్లాప్ మైత్రీని ఎఫెక్ట్ చేయడం పక్కన పెడితే హీరోగా నితిన్, దర్శకుడిగా వెంకీపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. నితిన్ కు ఈమధ్య వరుస ఫ్లాపులు తగులుతున్నాయి. ‘రాబిన్ హుడ్’తో కోలుకొంటాడని అంతా అనుకొన్నారు. ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డాడు కూడా. కానీ ఫలితం దక్కలేదు. ఈ సినిమా హిట్ తో హ్యాట్రిక్ కొట్టేసి, పెద్ద హీరోల దృష్టిలో పడదామనుకొన్న వెంకీదీ అదే పరిస్థితి. ఇప్పుడు మళ్లీ వెంకీ తన ప్రయాణం మొదటి నుంచి ప్రారంభించాలి. మళ్లీ హిట్ కొడితే కానీ, పెద్ద హీరోల దృష్టి పడదు.