డిసెంబరులో రావాల్సిన సినిమా ‘రాబిన్ హుడ్’. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈనెల 28న విడుదలకు రెడీ అయ్యింది. నిజానికి ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవు. పైగా వాయిదాల పర్వం ఎదుర్కొంది. నితిన్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. శ్రీలీల టైమ్ అంతంత మాత్రమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘రాబిన్ హుడ్’ని లైట్ తీసుకొన్నారంతా.
కానీ… క్రేజీ ప్రమోషన్ల వల్ల ‘రాబిన్ హుడ్’ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. `’అదిదా సర్ప్రైజ్’ పాటలో స్టెప్పు అభ్యంతరకరంగా ఉన్నా, జనంలోకి మాత్రం దూసుకెళ్లిపోయింది. ఈ పాటపై రీల్స్ లెక్కలేనన్ని వచ్చాయి. దాన్ని బట్టే ఈ పాట పాపులారిటీ అర్థం చేసుకోవొచ్చు. డేవిడ్ వార్నర్ ఎప్పుడైతే ఫ్రేమ్‌లోకి వచ్చాడో అప్పుడు ఇంకాస్త క్రేజ్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి డేవిడ్ వార్నర్‌ని తీసుకురావడం మరో పెద్ద ప్లస్. దాంతో ప్రచారం కావాల్సినంత దొరికింది.
టీజర్, ట్రైలర్ కట్లో.. దర్శకుడు తన తెలివి తేటల్ని చూపించాలనుకోలేదు. జస్ట్ నవ్వించాడంతే. ఈరోజుల్లో ఈమాత్రం కామెడీ ఉంటే సరిపోతుంది. థియేటర్లకు జనాలు సరదాగా కాలక్షేపం చేయడానికే వెళ్తారు. ఆ లక్షణం ఈ సినిమాలో ఉందన్న సంగతి అర్థమైంది. నితిన్ ఈ సినిమా ప్రమోషన్లలో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. రీల్స్ చేస్తున్నాడు. పాడ్ కాస్ట్ లో కూర్చుని ఫన్ సృష్టించాడు. మొత్తానికి ఈసారి టీమ్ మొత్తం ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమాని ముస్తాబు చేసింది. వరుస పరాజయాలతో ఉన్న నితిన్‌కు ఈ సినిమాతో ఉపశమనం దొరికితే… పడిన కష్టానికి ప్రతిఫలం దొరికినట్టే.