ఈగ, లెజెండ్ లాంటి సూపర్ డూపర్ హిట్లని తన ఖాతాలో వేసుకొన్న సంస్థ వారాహి చలన చిత్ర. ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, మరోవైపు సాయికొర్రపాటి తన అభిరుచికి తగ్గట్టుగా చిన్న సినిమాల్నీ రూపొందిస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ సాయి కొర్రపాటి బ్యానర్లోనే ఉండబోతోంది. గౌతమి పుత్ర సీడెడ్ హక్కుల్నీ ఆయన కైవసం చేసుకొన్నారు. ఇప్పుడు రోబో 2 తెలుగు రైట్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. రజనీకాంత్ – శంకర్ కాంబోపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోబోతో వీళ్లు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రోబో 2 లోనూ ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వబోతోందని చిత్రసీమ భావిస్తోంది. అందుకే తెలుగు రైట్స్ సంపాదించడానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. తెలుగు రైట్స్ కోసం పోటీ పడుతున్నవాళ్లలో సాయి కొర్రపాటి కూడా ఉన్నట్టు సమాచారం. రోబో 2 రైట్స్ కోసం శంకర్ అండ్ టీమ్ ఏకంగా రూ.65 కోట్లు డిమాండ్ చేస్తోందట. రోబో పై ఎంత క్రేజ్ ఉన్నా… ఆ స్థాయిలో కలక్షన్లు ఉంటాయా అనే లెక్కలు వేసుకొంటున్నారిప్పుడు. రోబో హిట్ అయితే ఓకే. ఐలా హ్యాండిస్తే పరిస్థితి ఏంటి? తెలుగు నుంచి ఆఫర్ చేసిన నిర్మాతలంతా ఇప్పటి వరకూ రూ.50 కోట్ల వరకూ వెళ్లి ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఒకవేళ సాయి కొర్రపాటి ఏమైనా 50 దాటే సాహసం చేస్తారేమో చూడాలి. చేస్తే.. రోబో 2 తెలుగు హక్కులు ఆయన సొంతం అవ్వడం ఖాయం.