అబ్దుల్‌కలామ్ అంటే ఇట్టే గుర్తు పడతాం కానీ, నంబి నారాయణన్ పేరు చెబితే మాత్రం ఈయన ఎవరని అడిగేవాళ్లు చాలామంది. కలాం సమకాలికుడే నంబి నారాయణన్. అంతరిక్ష పరిశోధనలో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన దిగ్గజాలు ఆ ఇద్దరూ. కలాం జీవితం గురించి అందరికీ తెలుసు కానీ, నంబి జీవితం మాత్రం అంతగా ప్రాచుర్యం పొందలేదు. అంతరిక్ష పరిశోధనలో మన ఇస్రోని ప్రపంచదేశాల సరసన నిలబెట్టిన అతి కొద్దిమంది ముఖ్యుల్లో నంబి నారాయణన్ ఒకరు. అంత కీర్తి గడించిన ఆయన అనూహ్యంగా గూఢచర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేశద్రోహి అంటూ నిందలు పడ్డారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం మీ సేవలు కావాలంటూ వెంటపడినా, నంబి నారాయణన్ మాత్రం దేశమే నాకు మిన్న అంటూ ఇండియాకి వచ్చిన గొప్ప దేశభక్తుడు ఆయన. అలాంటి వ్యక్తిపై నిందలు పడటం, జైలు జీవితం గడపడం, ఆ తర్వాత ఆ ఆరోపణలు అబద్ధం అని నిరూపించుకోవడం, ప్రభుత్వాల నుంచి పరిహారం పొందడం, అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ బిరుదు పొందడం… ఇలా సినిమాని తలపించే సంఘటనలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఆయన జీవిత కథనే `రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్` పేరుతో తెరపైకి తీసుకొచ్చారు నటుడు మాధవన్. బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న ఈసమయంలో వచ్చిన `రాకెట్రీ` ఎలా ఉంది? దర్శకుడిగా మాధవన్ చేసిన తొలి ప్రయత్నం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుంది? తదితర విషయాలు తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం..
నంబి నారాయణన్ మన రాకెట్ సైన్స్ రహస్యాల్ని మాల్దీవులకి చెందిన ఓ మహిళ ద్వారా పాకిస్తాన్‌కి చేరవేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ కావడం నుంచి కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథానాయకుడు సూర్య ఓ టీవీ స్టూడియోలో నంబి నారాయణన్ని ఇంటర్వ్చూ చేయడం మొదలు పెడతాడు. తన జీవితంలోని ఘట్టాలను ఒకొక్క పార్శ్వాన్ని ఆవిష్కరిస్తారు. ప్రఖ్యాత ప్రిన్స్టన్ కళాశాలలో మాస్టర్స్ చేయడం మొదలుకొని, దేశానికి కావల్సిన శాస్త్ర సాంకేతికతని ఫ్రాన్స్, రష్యా, స్కాట్లాండ్ తదితర దేశాల నుంచి సంపాదించడం, ఆ తర్వాత అనూహ్యంగా ఆరోపణల్ని ఎదుర్కోవడం, అవి తప్పని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం వరకు ఈ కథ సాగుతుంది. వికాస్ ఇంజిన్ని, క్రయోజనిక్ సాంకేతికత కోసం నంబి నారాయణన్ చేసిన కృషిని తెరపై ఆవిష్కరించారు. విక్రమ్ సారాబాయ్, సతీష్ ధవన్, అబ్దుల్ కలాం వంటి ఉద్ధండులతో కలిసి చేసిన ప్రయాణాన్ని కూడా ఈ కథలో ఆవిష్కరించారు. నేను నిర్దోషిని సరే, మరి అసలు దోషులెవరనేది తేలాలి కదా అని నారాయణన్ ప్రశ్నని కూడా ఈ కథలో నొక్కి చెప్పారు.
జీవిత కథల్ని తెరకెక్కించేటప్పుడు దర్శకులు డ్రామాపైనా, హీరోయిజంపైనా ప్రత్యేకంగా దృష్టిపెడుతూ అందుకు తగ్గ మసాలాలు జోడిస్తారు. కానీ ఇక్కడ నంబి నారాయణన్ జీవితంలోనే కావల్సినంత డ్రామా ఉంది. దాంతో ఈ సినిమాని ఉన్నదున్నట్టుగా డాక్యుమెంటైజ్ చేస్తే చాలనుకున్నట్టున్నారు మాధవన్. సగటు బయోపిక్ల్లాగా ఇందులో హీరోయిజాన్ని జోడించడానికి కూడా ఆస్కారం దక్కలేదు. కథానాయకుడు సైంటిస్ట్ కావడమే అందుకు కారణం. కానీ నంబి నారాయణన్లోని కనిపించే పట్టుదల, ఆయన తెగువని తెరపై ఆవిష్కరిస్తూ కథపై పట్టుని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అయితే ప్రథమార్థం మొత్తం ఓ ప్రయోగశాల తరగతిలా సాగుతుంది. సాలిడ్ ప్రొపెలెంట్స్, లిక్విడ్ ప్రొపెలెంట్స్, క్రయోజినిక్ టెక్నాలజీ… ఇలా పలు విషయాల్ని ఇందులో చర్చించారు. అవన్నీ సామాన్య ప్రేక్షకుడికి అర్థం కావు.
కానీ స్కాట్లాండ్, ఫ్రాన్స్, రష్యా దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించడం కోసం నంబి చేసే ఎత్తుగడలు ఆకట్టుకుంటాయి. వికాస్ ఇంజిన్ని పరీక్షించే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇలా ప్రథమార్థమంతా ఇస్రో కోసం నంబి నారాయణన్ చేసిన విషయాలన్నిటినీ ఆవిష్కరించిన మాధవన్… ద్వితీయార్థంలో ఆయనపై పడిన మచ్చ, ఆ తర్వాత తనూ, తన కుటుంబం ఎదుర్కొన్న సంఘర్షణని చూపిస్తూ భావోద్వేగాల్ని పండించే ప్రయత్నం చేశారు. సీబీఐ పరిశోధన కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. పతాక సన్నివేశాల్లో మాధవన్ స్థానంలో నేరుగా నంబి నారాయణన్నే చూపించడం, ఆయనకి దేశ ప్రజలందరి తరఫున నేను క్షమాపణలు చెబుతున్నా అంటూ సూర్యతో చెప్పించిన సంభాషణలు హత్తుకుంటాయి. తొలి సగభాగం సైన్స్ పాఠం అనిపించినా, ద్వితీయార్థం మాత్రం సోషల్ పాఠంలా మనసుల్ని తాకుతుంది.
నటన పరంగా మాధవన్ మేజిక్ చేశాడు. కాలేజీ రోజుల నుంచి, ఎనభయ్యేళ్ల వయసు వరకు సాగే నంబి నారాయణన్ పాత్రలో ఒదిగిపోయారు. ఈ పాత్ర కోసం బరువు తగ్గారు, బరువు పెరిగారు. ఆఖరికి తన పంటి వరస కూడా మార్చుకున్నారు. ఏ కథానాయకుడైనా వృద్ధుడిగా కనిపించాలంటే ప్రాస్థెటిక్ మేకప్‌ని సంప్రదించడం చూస్తుంటాం. కానీ మాధవన్ మాత్రం వాటి జోలికి వెళ్లకుండా చాలా సహజంగా తెరపై కనిపించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లోనూ నటులు అంతే సహజంగా ఒదిగిపోయారు. నారాయణన్ అర్థాంగి మీనా నారాయణన్‌గా సిమ్రన్ చక్కటి భావోద్వేగాల్ని పలికించారు. ద్వితీయార్థంలో ఆమె నటన మనసుల్ని హత్తుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా మాధవన్ రచన, దర్శకత్వం ఉన్నతమైన శ్రేణిలో ఉంటాయి. అక్కడక్కడా డాక్యుమెంటరీలా అనిపించినా, సైన్స్‌తో ముడిపడిన క్లిష్టమైన విషయాల్ని కూడా చాలా సులభంగా చర్చించారు. నిర్మాణంలోనూ భాగస్వామి అయిన మాధవన్ తనకున్న వనరుల్లోనే మంచి హంగులతో సినిమాని తీర్చిదిద్దారు. ఎడిటింగ్, మ్యూజిక్ తదితర విభాగాలు ఉన్నతంగా పనిచేశాయి.
కమర్షియల్‌గా సినిమా ఏ స్థాయికి వెళుతుందనేది పక్కనపెడితే ఓ నిజాయతీ ప్రయత్నం అని మాత్రం చెప్పొచ్చు. వెలుగుచూడని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారని, వాళ్లందరి కథలు బయటికి రావాలనే విషయాన్ని ఈ చిత్రం చాటి చెబుతుంది.