పూరి కూడా గురువు రాంగోపాల్ వర్మలానే. ఎన్ని ఫ్లాపులు తీసినా… తనపై నమ్మకాన్ని అలానే హోల్డ్ చేసుకోగలడు. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం.. ఇలాంటి ఫ్లాపులు మరో దర్శకుడికి తగిలితే తదుపరి సినిమాపై ఎవ్వరికీ నమ్మకాలుండకపోయేవి. ఆ దర్శకుడు పూరి కాబట్టి.. తన తాజా చిత్రం రోగ్పైనా అటెన్షన్ పెంచుకొనేలా చేసుకోగలిగాడు. మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ కూడా పూరి ఫ్యాన్స్‌ని ఆకర్షిస్తోంది. ఇడియట్ రోజుల్లో చూసిన పూరి… మళ్లీ కనిపిస్తాడేమో అన్న ఆశ కలుగుతోంది. వీటి మధ్య `రోగ్` ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ట్రైలర్ చూస్తే కథ పూర్తిగా చెప్పలేం గానీ.. ఆ కథ ఎలా సాగుతుందో కాస్తయినా అర్థం చేసుకోవొచ్చు. అలా చూస్తే ‘రోగ్’ ద్వారా పూరి కొత్త కథలేం చెప్పడం లేదని తేలిపోతోంది. ఓ ఇడియట్ లాంటి హీరో.. అందమైన అమ్మాయి.. మధ్యలో సైకో లాంటి విలన్.. `రోగ్` కథ ఇంతకు మించి ఏం ఉండకపోవచ్చు. ‘ఆ పీస్ నాది..’ అంటూ అమ్మాయిని ఇండికేట్ చేస్తూ చెప్పిన డైలాగ్ వింటే…. పూరి మార్క్ ఏమాత్రం మారలేదనిపిస్తోంది. ట్రైలర్లో నే మరో డైలాగ్ వినిపించింది.’షోరూమ్ బళ్లేం లేవిక్కడ…అన్నీ సెకండ్ హ్యాండ్లే’ అని. ట్రైలర్ కూడా ఆ డైలాగ్‌కి సరిపోతుంది. పూరి గత సినిమాల్లో చూసిన, చూపించిన షాట్స్.. ఆ తరహా రఫ్ హీరోయిజం.. ఫాస్ట్ ఫేస్ యాక్షన్ ఇవన్నీ ఇందులోనూ మేళవించాడు. కాకపోతే… హీరో హ్యాండ్సమ్గా కనిపించాడు. అతని లుక్స్ బాగున్నాయి. ఫస్ట్ షాట్స్‌లోనే కథానాయికని హాట్ హాట్‌గా చూపించేశాడు. యూత్‌ని టార్గెట్ చేయడానికి ఆ షాట్స్ బాగానే ఉపయోగపడతాయి. అయితే మరీ కట్టిపడేసే.. షాట్స్.. ‘అదిరిపోయింది’ అనిపించుకొనే డైలాగ్ లేకపోవడం ‘రోగ్’లో మైనస్. ఎలాగూ బాలయ్య సినిమా అందేసిందిగా. ఈ రిజల్ట్‌తో పూరికి పని లేదు. బాలయ్య సినిమాతో నిరూపించుకొంటే చాలు. ఆ కాన్ఫిడెన్స్ తో ట్రైలర్ కట్ చేశాడా… అనిపిస్తోంది. చూద్దాం.. బాక్సాఫీసు దగ్గర రిజల్ట్ ఎలా ఉంటుందో??