పూరి జగన్నాద్ సినిమా అంటేనే హీరోయిజం. అది కూడా మామూలు హీరోయిజం కాదు. పీక్స్ లో వుటుంది. చంటి.. చంటిగాడు లోకల్. బద్రి.. బద్రినాద్. శివమణి.. నా కొంచెం మెంటల్, ‘పండుగాడు”.. మైండ్ బ్లాంక్ అయిపోవల్సిందే. ఇలా అదిరిపోయే హీరోయిజం వున్న పాత్రలను సృస్టించాడు పూరి. పూరి సినిమా అంటే హీరోయిజంను ఎంజాయ్ చేయడానికి థియేటర్ లోకి అడుగుపెడతారు ఆడియన్స్. అయితే గత కొంతకాలంగా పూరి హీరో ట్రాక్ తప్పుతున్నాడు. నేటివిటికి, వాస్తవానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. దీంతో ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోతున్నారు.
జనరల్ గానే పూరి హీరో చాలా హైపర్. గాల్లో మాట్లాడుతుంటాడు. ఇంక తనకు అడ్డులేదు అనుకుంటూ లాజిక్ కి దూరంగా ఏదిపడితే అది చేస్తుంటాడు. ఒకప్పుడు ఇది చాలా కొత్తగా అనిపించింది. ”అరె.. భలే వుందే” అని ఫీలయ్యారు ఆడియన్స్. అయితే ఇది రాను రాను రోతగా మారింది. అందులోనూ ఇప్పుడు పూరి ఎంచుకుంటున్న బ్యాక్ డ్రాప్‌లు కూడా సగటు ప్రేక్షకుడు కనెక్ట్ చేసుకోలేకపోతున్నాడు. పూరి గత చిత్రాలు పరిశీలిస్తే.. ఇడియట్ లో చంటిగాడు ఒక సామాన్య కానిస్టేబుల్ కొడుకు. మనలో ఒకడిగానే కనిపిస్తాడు. చంటిగాడు లోకల్ అంటే ప్రేక్షకులు కూడా భలే కనెక్ట్ అయిపోయారు. బద్రిలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా నేల మీదే నడుస్తుంది. అమ్మనాన్న తమిళమ్మాయి గురించి చెప్పుకుంటే.. మదర్ సెంటిమెంట్- హీరోయిజం మిక్స్ చేసి ప్రేక్షకులను కదిలించాడు పూరి. ఇంచుమించు ఇవన్నీ కూడా లోకల్ ఫీల్ తెచ్చాయి.
అయితే గతకొంత కాలంగా పూరి నుండి వస్తున్న సినిమాలు ప్లాస్టిక్ కధలు చెబుతున్నాయి తప్పితే నేటివిటి, జీవం కనిపించడం లేదు. ఒకప్పుడు పూరి విలన్ మలేషియా లేదా బ్యాంకాక్ నుండి ఇక్కడి వచ్చి హీరోతో తలపడేవాడు. ఇప్పుడు ఆ గొడవంత అనవసరం అనుకోని స్క్రిప్ట్ మొత్తం ఎదో ఫారిన్ బీచ్ ప్రాంతంలో చుట్టేస్తున్నాడు. ఫారిన్ ట్రిప్ కోసం సినిమా తీసినట్లుగా ఉటుంది వ్యవహారం. ఇది తప్పుకాదు కానీ కనెక్షన్ కుదరడం లేదు. హార్ట్ ఎటాక్ తీసుకుంటే.. ఏ లక్ష్యం లేకుండా దేశాలు పట్టుకు తిరుగుతుంతాడు హీరో. వాడికే ఒక క్లారిటీ వుండదు. ఏదేదో చేస్తుంటాడు. అలాంటి క్యారెక్టర్ తో ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారు? రిజల్ట్ కూడా అలానే వచ్చింది. లోఫర్ లో కూడా ఇదే తంతు. అసలు ఆ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో జరుగుతోందో రిజిస్టర్ కాదు. హీరో పాత్ర కూడా మరీ టూమచ్. ”ఏజ్ అయిపోతుంది నాన్న. నైట్ కంట్రోల్ చేయడం ఎంత కష్టం అవుతుందో తెలుసా? అని తండ్రితో ఓ డైలాగ్ చెబుతాడు కొడుకు. ఇంతటి భీవత్స ఔచిత్యం వున్న పాత్ర, సామాన్య ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుంది. ఇందులో మదర్ సెంటిమెంట్ అన్నారు. అమ్మనాన్న తమిళమ్మాయితో పోలిక పెట్టారు. ఆ మ్యాజిక్ ఏమీ వర్క్ అవుట్ కాలేదు. జయసుధ సగటు తల్లిగా కనిపిస్తే.. రేవతి పాత్రను మాత్రం తనలా రెబల్ గానే తీర్చిదిద్దాడు పూరి. ఇంకా ఎక్కడ ఆ ఫీల్ వస్తుంది.
ఇప్పుడు పూరి నుండి మరో సినిమా వస్తుంది. అదే రోగ్. ట్రైలర్ కూడా బయటికివచ్చింది. ఇందులోనూ అదే తంతు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. కొత్తదనం లేదు సరికదా.. మరీ విచ్ఛలవిడితనం కనిపించింది. హద్దులుమీరిన శ్రుంగారం, పైశాచిక విలనిజం, అమ్మాయిల క్యాక్టర్లపై తన మార్క్ డైలాగులు.. ఇలా ఏదేదో చూపించాడు పూరి. బ్యాక్ డ్రాప్ కూడా బ్యాంకాక్ వాసన కొడుతోంది. చిన్న సినిమాలతో కూడా అద్భుతాలు చేశాడు పూరి. అయితే రోగ్ ట్రైలర్ లో ఆ ఛాయలు కనిపించడం లేదు. గత కొన్నాళ్లుగా పూరి మూడ్ మారిపోయింది. నేటిటివికి దూరంగా వెళ్ళిపోతున్నాయి ఆయన థాట్స్ . ఇప్పుడు రోగ్ ట్రైలర్ చూస్తే కూడా అదే ఫీలింగ్ వచ్చింది. పైగా అన్నీ కొత్త మొహాలే. ఈ సినిమా ప్రేక్షకులు ఎందుకు చూడాలి అంటే.. పూరి పేరే కనిపిస్తుంది. మరి, పూరి పేరుతో ఎన్ని టికెట్లు తెగుతాయో చూడాలి.