కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారిన ఇద్దరు మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోరాటం ఏ మాత్రం ఆగడంలేదు. వారి వ్యక్తిగత ఫైట్ కాస్తా ప్రభుత్వం దగ్గరికి చేరడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే తాను పోరాడుతున్నట్లు ఐపీఎస్ రూప మౌద్గిల్ తాజాగా పోస్టు పెట్టగా.. ఐఏఎస్ రోహిణీ సింధూరినేమో ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాదు పరువుకు భంగం కలిగించినందుకు, ఆరోపణలతో మానసిక వేదన కలిగించినందుకు రూ. కోటి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో వెల్లడించారు.
తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు .. ఇతర అంశాలు స్నేహితులు, బంధువులకు తెలియడంతో గత కొద్ది రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్టు రోహిణీ ఆరోపించారు. అలాగే సింధూరిని ఉద్దేశించి చేసిన ఫేస్బుక్ పోస్టులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రూప ఫేస్ బుక్ లో చేసిన రచ్చ అనంతరం అధికారులు వీద్దరినీ బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచారు. దాంతో పాటు వీరు సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు చేసుకోవద్దని, బహిరంగ ప్రకటనలు ఇవ్వొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినా రూపా మళ్లీ ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు.
రోహిణీ సింధూరి తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు. గతంలో అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు రోహిణి సిందూరి తల్లి అమరావతి కూడా వచ్చారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో డిప్యూటేషన్ పై రోహిణి సింధూరిని ఏపీకి తీసుకొస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో అది ఆగిపోయింది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఆత్మహత్యతో రోహిణి సింధూరికి లింక్ ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి ఇద్దరు మహిళా సివిల్ సర్వీస్ ఆఫీసర్ల వ్యవహారం ఎటు తిరుగుతుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.