భారత టెస్ట్ జట్టు నుంచి రిటైర్ అవ్వబోతున్నట్టు వస్తున్న వార్తల్ని రోహిత్ శర్మ ఖండించాడు. ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టి పడేశాడు. సిడ్నీ టెస్ట్ టాస్ కు ముందే.. రిజర్వ్ బెంచ్‌కి పరిమితమయ్యాడు రోహిత్. కెప్టెన్ బాధ్యతలు బుమ్రాకి అప్పగించారు. పైగా ఈ సిరీస్ అంతా చెత్త బ్యాటింగ్ తో విమర్శల పాలయ్యాడు రోహిత్. ఫామ్ లో లేనప్పుడు జట్టు నుంచి తప్పుకోవడమే మంచిదంటూ.. సీనియర్లు హితవు పలికారు. మీడియా కూడా రోహిత్ రిటైర్ అయిపోతే బాగుంటుందంటూ సలహాలు ఇచ్చింది. దానికి తోడు సిడ్నీ టెస్ట్ లో రోహిత్ ఆడడం లేదు. ఇవన్నీ బేరీజు వేసుకొని రోహిత్ రిటైర్ అయిపోయాడన్న కథనాలు మరింత జోరందుకొన్నాయి.
వీటిపై ఈరోజు రోహిత్ క్లారిటీ ఇచ్చేశాడు. తాను రిటైర్ అవ్వలేదని, కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకొన్నారని స్పష్టం చేశాడు. తాను ఇద్దరు పిల్లల తండ్రినని ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫామ్ లో లేని మాట నిజమo అని, అందుకే జట్టు ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని, త్వరలో ఫామ్ లోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. జైస్వాల్, రాహుల్ జోడీ ఫామ్ లో ఉందని, విలువైన పరుగుల్ని రాబడుతున్నారని, ఆ జోడీని విడగొట్టడం ఇష్టం లేకే.. తాను జట్టు నుంచి తప్పుకొన్నానని అంటున్నాడు రోహిత్. పెన్నులు, లాప్ టాప్లూ పట్టుకొని కూర్చున్న జనాలు ఏవేవో రాస్తుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన పరోక్షంగా మీడియాపై సెటైర్లు వేశాడు రోహిత్. డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి సమస్యలూ లేవని, ఇవన్నీ కట్టు కథనాలే అని కొట్టిపారేశాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.రోహిత్ శర్మ లాంటి ఆటగాడికి ఘనమైన వీడ్కోలు అవసరం. తన లాంటి ప్లేయర్ సైలెంట్ గా వెళ్లిపోకూడదన్నది అందరి అభిప్రాయం. సిడ్నీ టెస్ట్ ని భారత్ గెలుచుకొంటే, వరల్డ్ ఛాంపియన్ షిప్ కు అవకాశాలు ఉంటాయి. ఆ మ్యాచ్‌లో టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలకాలన్నది రోహిత్ ఉద్దేశం కావొచ్చు.