ఈ టీ 20 వరల్డ్ కప్ లోనే అత్యంత ఆసక్తికరమైన పోరు రేపు (ఆదివారం) జరగబోతోంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా – పాకిస్థాన్ తలపడబోతున్నాయి. అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే ఉంది. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవొచ్చని తెలుస్తోంది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో భుజం నొప్పితో రోహిత్ రిటైర్డ్ హార్డ్ గా వెనుతిరిగిన సంగతి తెలిసిందే. భుజం నొప్పే కాబట్టి ఫ్యాన్స్ పెద్దగా ఆందోళన చెందలేదు. రోహిత్ కూడా మ్యాచ్ అనంతరం హుషారుగానే కనిపించాడు. అయితే… శుక్రవారం ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ మళ్లీ గాయపడినట్టు సమాచారం. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓ బంతి రోహిత్ చేతికి బలంగా తాకిందని, దాంతో బొటనివేలుకు గాయమైందని తెలుస్తోంది. అప్పటికప్పుడు వైద్యులు రంగ ప్రవేశం చేసి, ప్రాధమిక చికిత్స చేశారు. అయితే నొప్పి తగ్గకపోవడంతో, ప్రాక్టీస్ మధ్యలోనే రోహిత్ వెనుదిరిగాడు.
అయితే రోహిత్ గాయంపై మేనేజ్మెంట్ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే, భారత్‌కు అది పెద్ద దెబ్బే. రోహిత్ స్థానంలో బుమ్రా జట్టుకు నాయకత్వం వహించే వీలుంది. మరోవైపు పాక్ కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. తొలి మ్యాచ్‌లో పసికూన అమెరికా చేతిలో పరాభవం ఎదుర్కొంది. ఈ వరల్డ్ కప్‌లో నిలవాలంటే, భారత్ తో మ్యాచ్ గెలవక తప్పని పరిస్థితి. ఐసీసీ టోర్నీలలో భారత్ పై పాక్‌కు మెరుగైన రికార్డు లేదు. వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించిన సందర్భం ఒక్కటీ లేదు. ఆ ఘోరమైన ట్రాక్ రికార్డు నుంచి ఉపశమనం పొందాలంటే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి. అందుకోసం పాక్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.