ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ధోనీ ఎలానో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు అంటే విరాట్ కోహ్లీ అలా. ముంబై మాటకొస్తే రోహిత్ శర్మ. వీళ్లే ఆయా జట్లకు బలం, బలగం. టీమ్ లో ఎంతమంది స్టార్ ప్లేయర్లయినా ఉండొచ్చు. కానీ.. వీళ్ల ఫ్యాన్ ఫాలోయింగ్ సెపరేట్. అయితే ఈ ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ ముంబైని వీడుతున్నాడని ప్రచారం జరిగింది. ముంబై యాజమాన్యం కూడా రోహిత్ శర్మని వదిలించుకోవాలని చూస్తోందని, అందుకే గత సీజన్లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించారని గుసగుసలు వినిపించాయి. రోహిత్ కూడా జట్టు యాజమాన్యంపై గుర్రుగా ఉన్నాడని, హార్దిక్ తో విబేధాల వల్ల జట్టులో మనలేకపోతున్నాడని చెప్పుకొచ్చారు. రోహిత్ బెంగళూరు జట్టుకు వస్తాడని కూడా జోస్యం చెప్పారు. అయితే అలాంటి పరిణామాలేం సంభవించలేదు. రోహిత్ ని ముంబై జట్టు అట్టి పెట్టుకొంది. ఈనెలలో ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. ఈలోగా ఏయే జట్లు తమ ఆటగాళ్లని రిటెన్షన్ లిస్టులో పెడతాయా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రతీ యేటా ఐపీఎల్ జట్లు తమకు భారమైన ఆటగాళ్లని వదిలేసుకొంటుంది. వాళ్లని వేలంలో పాడుకోవొచ్చు. అలా ఈసారి ముంబై జట్టు రోహిత్ ని వదులుకొంటుందనుకొన్నారు. కానీ రోహిత్ ని ముంబై జట్టు రూ.16.3 కోట్లకు అట్టిపెట్టుకొంది. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రాలను సైతం ముంబై తన జట్టులోనే ఉంచుకొంది. వీళ్లంతా ముంబైకు కీలకమైన ఆటగాళ్లు.
సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే క్లాసెన్, కమిన్స్, హెడ్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డిలను రిటెన్షన్ జాబితాలో చేర్చింది. గత ఐపీఎల్ లో వీళ్లంతా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈయేడాది కూడా చెన్నై తరపున ధోనీ బరిలో దిగబోతున్నాడు. ధోనిని రేటు రూ.4 కోట్లకు ఫిక్స్ చేసిన చెన్నై తన జట్టులో ఉంచుకొంది. అంటే.. ఈసారీ ధోనీ చెన్నై తరపున బరిలోకి దిగడం ఖాయమన్నమాట.