రో’హిట్’ శర్మ మరోసారి విశ్వరూపం చూపించాడు. డబుల్ సెంచరీ కొట్టడం తనకు మంచినీళ్ల ప్రాయమని మరోసారి నిరూపించాడు. ఇప్పటికే వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలతో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్…. మరో డబుల్ సెంచరీ కొట్టి తన రికార్డుని మరింత పదిల పరచుకున్నాడు. మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకొంది. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ (153 బంతుల్లో 208) సాధించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేయగలిగింది. రోహిత్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు 12 సిక్సర్లున్నాయి. వన్డేలలో రోహిత్‌కి ఇది మూడో డబుల్. వన్డేలో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు కూడా రోహిత్ శర్మ పేరుమీదే ఉంది. 2014లో ఇదే శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు రోహిత్.
40 ఓవర్ల సమయానికి రోహిత్ వంద పరుగులకు చేరుకున్నాడు. అప్పటికి రోహిత్ డబుల్ సెంచరీ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. సెంచరీ తరవాత రోహిత్ బ్యాటింగ్‌లో వేగం ఒక్కసారిగా మారిపోయింది. ఓ దశలో తాను ఎదుర్కొన్న 7 బంతుల్లో ఏకంగా ఆరు సిక్సులు కొట్టాడు. రోహిత్ దెబ్బకు శ్రీలంక బౌలర్లు, ఫీల్డర్లు డీలా పడ్డారు. ప్రత్యర్థికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయిన రోహిత్… తన కెరీర్లో మరో అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. ధావన్ (68), శ్రేయాస్ అయ్యర్ (88) పరుగులతో రోహిత్‌కి అండగా నిలిచారు.