టెస్ట్ ఫార్మెట్ కు ఓ లెక్క ఉంటుంది. నెమ్మదిగా, నిదానంగా, క్లాస్ టచ్‌తో ఆడడమే టెస్ట్ మ్యాచ్. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌ని టీ ట్వంటీ గా మార్చేశారు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్. కేవలం 3 ఓవర్లలో 51 పరుగులు పిండుకొన్నారు. సిక్సులు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. చూస్తోంది టెస్ట్ మ్యాచా, టీ 20నా? అనే సందేహాన్ని రేకెత్తించారు.
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ దాదాపుగా వర్షార్పణమైందని క్రికెట్ అభిమానులు ఫీల్ అవుతున్న వేళ. నాలుగో రోజు ఆ లోటు తీర్చేశారు భారత ఓపెనర్లు. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం భారత్ బ్యాటింగ్ మొదలెట్టింది. ఓపెనర్లు రోహిత్, యశస్వీ వచ్చీ రావడంతోనే బజ్ క్రికెట్ మజా చూపించారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా 3 ఓవర్లలో 51 పరుగులు చేసింది. ఈక్రమంలో అతి తక్కువ బంతుల్లో 50 పరుగులు సాధించిన ఓపెనర్లుగా ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరు మీద (24 బంతుల్లో) ఉండేది. రోహిత్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు సాధించాడు. ఇందులో 3 సిక్సులు, 1 ఫోరు ఉన్నాయి. అనంతరం మెహదీ హసన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జైస్వాల్ 50 (31 బంతుల్లో) బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ డ్రా అవ్వడం ఖాయం. అయితే భారత ఓపెనర్ల వీర విహారం మాత్రం ఈ మ్యాచ్‌ని గుర్తుండిపోయేలా చేసింది.