హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్ వేముల తల్లి రాధిక. ఈ కేసులో కింది కోర్టులో అప్పీల్ కు వెళ్ళవచ్చునని కోర్టు స్పష్టం చేయడంతో శనివారం ఉదయం రేవంత్ కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని రోహిత్ తల్లికి రేవంత్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
వర్సిటీలో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని 2016లో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన సమయంలో హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు అప్పటి వీసీ అప్పారావుతో పాటు బీజేపీ నేతలే కారణమని పెద్ద ఎత్తున ఆరోపణలు జరగడంతో ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.దాంతో 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు అప్పటి నుంచి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను సైతం జోడించారు. ఎనిమిదేళ్లుగా సాగుతోన్న ఈ కేసును తాజాగా మూసివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
అసలు రోహిత్ ఎస్సీ కాదని అతని కులం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళనతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అతను ఎస్సీ అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును మూసివేస్తున్నట్లు వెల్లడించారు. 2016 లో రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడంతో రాహుల్ గాంధీ హెచ్ సీ యూ వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే, ఈ కేసు విషయంలో రోహిత్ కుటుంబానికి చుక్కెదురు కావడంతో శనివారం న్యాయం చేయాలంటూ రేవంత్ ను రోహిత్ తల్లి కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.