హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి వేముల రోహిత్ తల్లి, సోదరుడు నేడు డా.అంబేద్కర్ జయంతి సందర్భంగా బౌద్ధమతం స్వీకరించబోతున్నారు. ముంబైలోని దాదర్ లో గల డా. అంబేద్కర్ భవన్ లో వారు భౌద్ధం స్వీకరిస్తారు.
వేధింపుల కారణంగా రోహిత్ వంటి ప్రతిభావంతుడయిన విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరమే. అందుకు బాద్యులయిన వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం మన వ్యవస్థ బలహీనతకి అద్దం పడుతోంది. వ్యవస్థపై తీవ్ర నిరాశ, నిస్పృహ, అసంతృప్తితోనే వారిరువురూ భౌద్ధం స్వీకరిస్తున్నట్లు భావించవచ్చు.
అయితే దీనిలో మరో కోణం కూడా కనబడుతోంది. రోహిత్ ఆత్మహత్య చేసుకొనే వరకు అతని కుటుంబం గురించి ఎవరికీ తెలియదు. రోహిత్ మృతి తరువాతనే హటాత్తుగా వారిరువురూ అందరి దృష్టిలో పడ్డారు. సోనియా, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ వంటి జాతీయ నేతలు వారితో మాట్లాడుతున్నారు. వారి గురించి మీడియాలో, చట్ట సభలలో మాట్లాడుకొంటున్నారు. రోహిత్ సోదరుడికి డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చేరు. (దానిపై అసంతృప్తి వ్యక్తం చేయడం వేరే సంగతి.) ఇవన్నీ వారు ఊహించని పరిణామాలే. ఇప్పుడు భౌద్ధమతం స్వీకరించమనే ప్రతిపాదన కూడా అటువంటిదేనని చెప్పవచ్చు.
భౌద్ధంలో చేరినంత మాత్రాన్న వారికి న్యాయం జరిగిపోదు..అలాగే వ్యవస్థ తీరు తెన్నులు మార్చుకోదని అందరికీ తెలుసు. కానీ ఆ విధంగా వారు వ్యవస్థపై తమ అసంతృప్తిని ప్రకటించినట్లు భావించవచ్చు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జె.ఎన్.యు. విద్యార్ధి కన్నయ కుమార్ కూడా తనకు దక్కిన ఆ కొత్త గుర్తింపును నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండటం గమనించవచ్చు. అతను తనకు తెలిసిన అందుబాటులో ఉన్న మార్గాలను ఎంచుకొంటుంటే, రోహిత్ తల్లి, సోదరుడు తమకు తెరుచుకొంటున్నకొత్త మార్గాలలో ప్రయాణిస్తున్నట్లున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా తాము ఎదుర్కొన్న సమస్య మూలాలలోకి వెళ్లి దాని పరిష్కారం కోసం గట్టిగా కృషి చేయకపోవడం గమనార్హం. బహుశః అది వారి శక్తికి మించిన పని కనుకనే దానిని పక్కనబెట్టి తమకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. కనుక ఎక్కడి సమస్యలు అక్కడే ఉంచి వారు, వారితో బాటు సమాజం కూడా ఏమీ జరగనట్లు ముందుకి పయనిస్తోందని చెప్పక తప్పదు.