హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రచ్చరచ్చగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాల్‌మనీ వ్యవహారంపై సభలో చెలరేగిపోయారు. అధికారపార్టీ ప్రకటన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైని నిలదీయమని ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి సైగలు చేయటంతో వారు అధికారపార్టీ బెంచీలవైపు దూసుకెళ్ళారు. రోజా ఒక అడుగు ముందుకెళ్ళి చంద్రబాబు వద్దకు వెళ్ళి ఆయన ఎదురుగా నిలుచుని అసభ్యపదజాలంతో దూషించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనితో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారి లేచి నిలుచుని గగ్గోలు పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు రోజాపైకి దూసుకెళ్ళబోగా చంద్రబాబు వారిని వారించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బజారు రౌడీలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై దౌర్జన్యం చేసే పరిస్థితి రావటం దారుణమన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధికారపార్టీ బెంచీలవైపు రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రౌడీయిజం చేయాలనుకుంటున్నారా అన్నారు. సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సభా సంప్రదాయాలను మంటగలుపుతున్నారని అన్నారు. వైసీపీలో ఎక్కువమంది తొలిసారి ఎన్నికైనవారేనని, వారికి నియమ నిబంధనలు తెలియవని విమర్శించారు. సభను డిక్టేట్ చేయాలనుకుంటున్నారని అన్నారు. శాసనసభ చరిత్రలో ఇలాంటి వ్యవహారాన్ని తాను ముందెన్నడూ చూడలేదని చెప్పారు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మూడు విడతలు ముఖ్యమంత్రిగా చేశానని, రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశానని గుర్తు చేశారు. నోరు పారేసుకోవటం మంచిది కాదని, వీళ్ళు ఎమ్మెల్యేలా అని మండిపడ్డారు. మీరు డౌన్ డౌన్ అంటే నేను డౌన్ అవుతానా అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.