ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైకాపా విమర్శలు చాలా శృతి మించుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇటీవల జగన్ చింతపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల నరుకుతానని, బాణాలు వేసి చంపుతామని వేలాదిమంది ప్రజల ముందు హెచ్చరించారు. అందుకు ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆమెనే వెనకేసుకొని వచ్చేరు తప్ప ఆమె ఆవిధంగా మాట్లాడటం, ఆ సమయంలో పక్కనే ఉన్న తను ఆమెను వారించకపోవడం తప్పేనని అంగీకరించలేదు. పైగా ఆయన కూడా ముఖ్యమంత్రి అంతటి వ్యక్తిని పట్టుకొని రకరకాల పేర్లు పెట్టి అవహేళన చేస్తున్నారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రిపట్ల అసభ్యంగా మాట్లాడుతుంటే ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేరేగా ఎలాగా మాట్లాడుతారు? అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా కూడా చంద్రబాబు నాయుడు పట్ల చాలా అనుచితంగా మాట్లాడారు.
ఆయన చికాగో విశ్వవిద్యాలయాన్ని మేనేజ్ చేసి డాక్టరేట్ ప్రకటింపజేసుకొన్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నకృషికి గుర్తింపుగా చికాగో విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇస్తున్నట్లు ప్రకటించడాన్ని ఆమె తప్పు పట్టారు. ఈ 18నెలల పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, నేరాలు పెరిగాయని వాటిని చూసే చంద్రబాబు నాయుడు డాక్టరేట్ ఇస్తోందా? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకి డాక్టరేట్ ఇవ్వాలనుకోవడం ద్వారా చికాగో విశ్వవిద్యాలయం తన స్థాయిని తానే దిగజార్చుకొంటోందని రోజా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమయిన రెండవ రాష్ట్రంగా ఇదివరకు ప్రపంచ బ్యాంక్ ప్రకటించినపుడు కూడా వైకాపా నేతలు ఈవిధంగానే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ని మేనేజ్ చేసి ఆవిధంగా ప్రకటింపజేసుకొన్నారని ఆరోపించారు.
వైకాపా నేతలు తెదేపా తమ రాజకీయ ప్రత్యర్ధి కనుక తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం సహజమేనని సరిపెట్టుకోవచ్చును. కానీ వారికి ప్రపంచ బ్యాంక్, చికాగో విశ్వవిద్యాలయం కూడా లోకువగానే కనిపిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. అసలు చికాగో విశ్వవిద్యాలయాన్ని మేనేజ్ చేసి డాక్టరేట్ డిగ్రీ ఇప్పించుకోవలసిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏమిటి? ఆ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడుకి ఏమయినా నష్టం కలుగుతుందా? లేకపోతే ఆయనకు ప్రస్తుతం ఉన్న గుర్తింపు లోటు ఏర్పడుతుందా? అని ఆలోచిస్తే రోజా చేసిన ఆరోపణలు ఎంత అర్ధరహితమయినవో అర్ధం అవుతుంది.
చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర విభజన హామీలను అమలు చేయించలేకపోతున్నారని, అసలు కేంద్రంలో ఆయన మాటకు విలువే లేదని విమర్శిస్తుంటారు. కానీ అదే నోటితో కేంద్రప్రభుత్వం ద్వారా ప్రపంచ బ్యాంక్ పై ఒత్తిడి తెచ్చి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమయిన రెండవ రాష్ట్రంగా ప్రకటింపజేసుకొన్నారని ఆరోపిస్తారు. కేంద్రానే ఒప్పించలేని వ్యక్తి ఇప్పుడు చికాగో విశ్వవిద్యాలయాన్ని కూడా మేనేజ్ చేస్తున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. వైకాపా నేతల ఉద్దేశ్యంలో చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఏ సంస్థనయినా మేనేజ్ చేయగలరన్నట్లుంది.
చంద్రబాబు నాయుడుకి నిజంగా అంత శక్తి ఉండి ఉంటే అందుకు తెలుగు ప్రజలు అందరూ సంతోషించాలి తప్ప అసూయ చెందనవసరం లేదు. ఆయనకు అంత శక్తే ఉండి ఉంటే ఆయన ఏ బారక్ ఒబామాతోనో…ప్రపంచ బాంకుతోనో..ఐక్యరాజ్యసమితితోనో మాట్లాడి తన పనులు చక్కబెట్టుకొని ఉండేవారు. కానీ నేటికీ ఆయన రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం ప్రధాని నరేంద్ర మోడితో అణిగిమణిగి ఉంటూ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండటం అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కేంద్రంతో మంచిగా ఉంటూ దాని సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వైకాపా నేతలకి ఆయన ప్రతీ చర్యలో కూడా తప్పుగానే కనబడుతుంటుంది. ఎందుకంటే తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆయనను శత్రువుగా భావిస్తున్నారు కనుకనే అని చెప్పక తప్పదు. ఈవిధంగా పరిస్థితిని బట్టి, సమస్యని బట్టి వైకాపా నేతలు వాదన ఒక్కో రకంగా ఉంటుందని రోజా విమర్శలు స్పష్టం చేస్తున్నాయి. కానీ విమర్శలలో సహేతుకత కంటే చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేకపోతున్నమనే నిస్సహాయత నుండి జనించిన ఈర్ష్యా అసూయలే ప్రస్పుటంగా కనబడుతున్నాయి.