వైకాపా మేనిఫెస్టోలో రాజధాని ప్రస్థావన లేని సంగతి తెలిసిందే. అమరావతిలో మొదలైన రాజధాని పనులను ఎలా కొనసాగిస్తారు, రాబోయే రోజుల్లో దాని నిర్మాణం పూర్తి చేసేందుకు ఏం చేస్తారు అనే స్పష్టత వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయారు. ఇక, రాజ్ దీప్ సర్దేశాయ్ లాంటి జాతీయ ఛానెళ్ల జర్నలిస్టులు రాజధాని మారుస్తారా అని అడిగితే… దానికి సూటిగా సమాధానం చెప్పుకుండా అధికార పార్టీ మీద విమర్శలకే జగన్ పరిమితమైన వైనాన్ని చూశారు. అదే బాటలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రోజా కూడా రాజధాని గురించి అడిగితే… అసలు విషయం వదిలేసి మాట్లాడుతున్నారు.
ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను మేనిఫెస్టోలో అమరావతి ప్రస్థావన లేదు కదా అని అడిగితే… ‘కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా టీడీపీవాళ్లు మాట్లాడతారు. గత ఐదేళ్లలో ఇది చేశాం, నా పరిపాలన చూసి నాకు ఓటెయ్యండి అనేది ఉండదు. జగన్ కేసీఆర్ తో కలిశాడు కాబట్టి నాకు ఓటెయ్యండి. జగన్ మోడీతో ఫోన్లో మాట్లాడాడు కాబట్టి నాకు ఓటెయ్యండి. మేనిఫెస్లోలో అమరావతి పెట్టలేదు కాబట్టి నాకు ఓటెయ్యండి అంటున్నారు’ అన్నారు రోజా. అమరావతిలో ఇల్లు కట్టుకున్నది, ఆఫీస్ పెట్టుకున్నది ఒక్క జగన్ మాత్రమే అన్నారు. కచ్చితంగా చక్కటి రాజధాని నిర్మిస్తారు, దాన్లో అన్ని వర్గాల వారికీ కూడా స్థానం లభిస్తుందన్నారు. ఇప్పుడున్న రాజధానిలో వాళ్ల కులం వారికి, కోటీశ్వరులకు మాత్రమే స్థానముందన్నారు.
చక్కని రాజధాని జగన్ నిర్మిస్తామన్నారు… కానీ, అది అమరావతిలో అని రోజా కూడా చెప్పలేదు. అంతేకాదు, ఇప్పుడున్న రాజధాని ఒక కులం వారిదే అనేశారు. అంటే, వీరంతా ఇస్తున్న సంకేతాలు ఏంటి..? అమరావతిలో పార్టీ ఆఫీస్ పెట్టుకోవడమే గొప్పగా చెప్తున్నారు. నాలుగున్నరేళ్లపాటు హైదరాబాద్ లో లోటస్ పాండ్ కి మాత్రమే జగన్ పరిమితమయ్యారని ప్రజలకు తెలుసు. ఏదేమైనా, రాజధాని నిర్మాణం విషయంలో వైకాపాకి స్పష్టత లేదని అనుకుంటున్నాం కానీ, వారికి ఇంకేదో స్పష్టత ఉందన్నట్టుగా వ్యవహార శైలి ఉంటోంది. మేనిఫెస్టోలో ఆ ఊసు ఉండదు. రాజధాని మారుస్తారా అంటే… కాదని సూటిగా స్పష్టంగా నేరుగా జగన్ కూడా ఖండించరు. ఇప్పుడు రోజా కూడా అంతే. ముఖ్యమంత్రి అయిపోదామనుకుంటున్న నాయకుడికి రాజధానిపై స్పష్టత లేకపోతే ఎలా..? ఆయనకంటూ ఉన్న స్పష్టతేదో ప్రజలకు చెప్పలేకపోతే ఎలా..?