వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా తరపున పోటీ చేస్తున్న నల్లా సూర్యప్రకాష్ తరపున ఎమ్మెల్యే రోజా చేస్తున్న ఎన్నికల ప్రచారం చాలా ముచ్చటగా ఉంది. ఈ ఎన్నికలలో బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పునే వరంగల్ ప్రజలు కూడా ఇవ్వాలని కోరడంతో పక్కనే ఉన్న వైకాపా అభ్యర్ధి తెల్లమొహం వేయవలసి వచ్చింది. ఎందుకంటే బిహార్ లో ప్రజలు అధికార కూటమికే ఓట్లు వేసి గెలిపించారు. అంటే వరంగల్ ఉప ఎన్నికలలో అధికార తెరాసకే ఓట్లు వేయమని రోజా కోరుతున్నట్లుంది. మోడీ అహంకారానికి బిహార్ ప్రజలు ఏవిధంగా గుణపాఠం చెప్పారో అదేవిధంగా అహంకారం ప్రదర్శిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని ఆమె ఉద్దేశ్యం కానీ ప్రజలకు అది మరోలా వినిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణాలో మొత్తం 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు అయినా తెరాస ప్రభుత్వం స్పందించలేదు,” అని ఆమె విమర్శించినపుడు కూడా జనాలు ముసిముసినవ్వులు నవ్వుకొన్నారు. రైతుల ఆత్మహత్యలను తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శిస్తున్న రోజా, ఆ సమస్యపై తమ పార్టీ కూడా ఏనాడూ నోరు విప్పి మాట్లాడలేదనే సంగతి గ్రహించినట్లు లేరు. అందుకే జనాలు నవ్వుకొంటున్నారు.
ఇంతకాలం తెరాస ప్రభుత్వానికి తమ పార్టీ వలన ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతోనే వైకాపా నేతలు ప్రజా సమస్యలపై పోరాడలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు, పేదలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీల గురించి తెరాస ప్రభుత్వాన్ని రోజా నిలదీస్తున్నారు. తెలంగాణాలో గడప గడపలో రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పధకాలే కనిపిస్తున్నాయని వరంగల్ ప్రజలకు రాజన్న ఋణం తీర్చుకొనే అవకాశం వచ్చిందన్నారు. కనుక మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే వైకాపా అభ్యర్ధికే ఓటు వేయాలని రోజా కోరారు. రాజశేఖర్ రెడ్డి హయంలోనే తెలంగాణా అత్యంత ఎక్కువగా దోపిడీకి గురయిందని తెలంగాణా ప్రజలు భావిస్తుంటే, వారు ఆయనకి రుణపడి ఉన్నారని దానిని తీర్చుకోవాలని కోరడం చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణా రాష్ట్రంలో వైకాపా తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం కూడా చేయడం లేదు. అటువంటప్పుడు ఒకే ఒక్క వైకాపా ఎంపీని ఎన్నుకొంటే రాజన్న రాజ్యం ఏవిధంగా వస్తుందో ఆమెకే తెలియాలి. ఒకవేళ వైకాపా అభ్యర్ధి గెలిచినా ఏదో ఒకనాడు తెరాసలో చేరిపోవడం మాత్రం ఖాయం. గత అనుభవాలను చూసినట్లయితే ఆ సంగతి అర్ధం అవుతుంది. అటువంటప్పుడు వైకాపా అభ్యర్ధికి ఓటేయడం కంటే అదేదో తెరాస అభ్యర్ధికే వేస్తే సరిపోతుంది కదా?