రాజకీయాలంటే ఇంతేనేమో? ఈ రొంపిలోకి దిగితే ఇలానే మాట్లాడేలేమో. శానస సభల్లో ఎలాగూ బూతులే మాట్లాడుకుంటున్నారు. మీడియా ముందు కూడా.. అదే గోలనా?? చర్చా వేదిక అనగానే సరికొత్త బూతులు పుట్టుకొస్తుంటాయి. ఎవరి గొంతు ఎక్కువో చెప్పుకోవడానికి దాన్ని వేదిక చేస్తున్నారు తప్ప, ప్రజల గొంతుకలు ఎక్కడా, ఎప్పుడూ వినిపించడం లేదు. పొరపాటున టీవీ ఛానల్ మీట నొక్కితే.. అందులో ఏ బూతులు వినాల్సివస్తుందో అన్న భయం పట్టుకొచ్చింది. టీవీ 9 లో సాగిన చర్చా వేదిక సాక్షిగా రాజకీయం `పక్కలేసింది`.
టీవీ 9 వాళ్లు ఈ రోజు బండ్ల గణేష్‌ని తీసుకొచ్చారు. ఆయనేమో పవన్ భక్తుడు. అవతల ఉన్నది.. రోజా. తగ్గ జోడీనే. ఒకరేమో జనసేన. ఇంకొకరు.. వైకాపా. టామ్ అండ్ జర్రీ గేమ్ నడిపి – వినోదం చూస్తూ కూర్చుండిపోయింది టీవీ 9. చిరంజీవిని నమ్ముకొచ్చాడు పవన్ కల్యాణ్, టాలెంట్ లేదు.. అదీ ఇదీ అని రోజా నిప్పు రగిల్చింది. పవన్ ని చిన్న మాటంటే పడని బండ్ల గణేష్ రెచ్చిపోవడానికి అంతకంటే అదును దొరుకుతుందా?? నువ్వు గోల్డెన్ లెగ్వీ, రాజశేఖర్ రెడ్డిని పైకి పంపించేశావ్, ఇప్పుడు జగన్ పక్కన చేరావ్ అక్కడే ఉండు.. అంటూ సెటైర్లు వేశాడు. రోజా ఏం తక్కువ తినలేదు కదా? ‘నువ్వు పవన్ పక్కన ఉండి పక్కలేస్తావా’ అంటూ అడిగేసింది. దానికి తమ్ముడు తగ్గలేదు. ‘అవును నిన్నూ పడుకోబెడతా’ అన్నాడు. పళ్లు రాలిపోతాయ్ అని రోజా.. నీ పళ్లు రాలగొడతా అంటూ బండ్ల గణేష్… టీవీ 9 చర్చా వేదిక పెట్టినందుకు, దానిలో బండ్ల గణేష్‌ని కూర్చోబెట్టినందుకు తగిన ప్రతిఫలం వచ్చేసింది. ఇక చూస్కోండి. ఇక నుంచి.. కొంతకాలం పాటు యూ ట్యూబ్‌లో ఈ వీడియో హల్ చల్ చేయడం ఖాయం. ఓ బాధ్యతాయుతమైన శాసన సభ్యురాలిగా ఉంటూ, ప్రతిపక్షంలో ముఖ్య నేతగా వ్యవహరిస్తు… ఈ ‘పక్కలేయడం’ లాంటి పదాలు వాడడం రోజాకి సమర్థనీయమా? రెచ్చగొట్టేలా మాట్లాడడం గణేష్‌కి భావ్యమా??
చర్చా వేదిక పేరు చెప్పి ఇలా రచ్చ చేయడం వెనుక వేరే ఉద్దేశ్యాలేం ఉండవు. టీఆర్పీ రేటింగులు పెంచుకోవడం తప్ప. జనాలు చూస్తున్నారన్న స్పృహ లేకుండా ఏమిటీ పిచ్చి వాగుడు..?? కాసేపు సహనంగా కూర్చుని మాట్లాడుకోలేకపోతున్నారు. ఇదేం రాజకీయం?? ప్రజలకు ఈ తిట్ల పురాణం వినే ఖర్మ ఎందుకు?? జనాలకు వినోదం, టీవీ ఛానళ్లకు ప్రమోదం తప్ప స్వచ్ఛమైన రాజకీయాలకు ఇవెందుకు ఉపయోగపడతాయ్?? రాజకీయమంటే ఎదుటివాళ్లపై చెత్త వేయడమే అనుకొంటే.. ప్రజలే అందుకు తగిన సమాధానం చెబుతారు.