వైకాపా ఎంపీలు రాజీనామా చేసిందే.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం! సరే, రాజీనామాల వల్ల అది ఎలా సాకారమౌతుందో వారే చెప్పలేని పరిస్థితి అనుకోండి..! పోనీ, ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తమ తరఫునే ఉందీ అని నిరూపించుకుందామన్నా… ఎన్నికలు రాని పరిస్థితుల కోసం వేచి చూసి రాజీనామాలు ఆమోదింపజేసుకున్నారు. అయితే, వైకాపా పోరాటం గురించి మరోసారి చెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా..! సీఎం రమేష్ చేస్తున్న దీక్షను ఆమె తప్పుబట్టారు. ఒక న్యూట్రల్ డాక్టర్ తో టెస్టులు చేయిస్తే ఇవి దొంగ దీక్షలని తేలిపోతాయన్నారు. ఇలాంటి దీక్షలు సంవత్సరం చేసినా వారి షుగర్ లెవెల్స్ పెరుగుతాయే తప్ప, తగ్గే ప్రసక్తి లేదన్నారు.
కడప ఉక్కు పరిశ్రమ ఒక్కటే కాదు… ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, వెనకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ వీటన్నింటి గురించి వైకాపా అధ్యక్షుడు జగన్ తో పాటు, ఆ పార్టీల ఎంపీలు కూడా పోరాటాలు చేశారంటూ రోజా చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఎంపీ పదవుల్ని తృణప్రాయంగా వదులుకుని, రాజీనామాలు ఆమోదింపజేసుకున్నారన్నారు. ప్రజలు దృష్టిలో నాయకులు అంటే ఇలా ఉండాలనే మెప్పు పొందారన్నారు. కానీ, టీడీపీ ఎంపీలు పదవుల్ని మాత్రం వదలరనీ, నాలుగేళ్ల తరువాత ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు.
నిజానికి, కడప స్టీల్ ప్లాంట్ పై ఇంత హడావుడి జరుగుతున్నా వైకాపా నుంచి సరైన స్పందన ఎక్కడుంది..? కడప ఉక్కు పరిశ్రమ కోసం తాము కూడా పోరాటాలు చేసి అలసి సొలసిపోయామన్నట్టుగా రోజా ఇప్పుడు మాట్లాడుతున్నారు. సరే, వైకాపా నేతల విమర్శల ప్రకారమే.. ప్రభుత్వం దగ్గర కడప ఫ్యాక్టరీ ఫీజుబిలిటీ రిపోర్టు రెండేళ్లుగానే మగ్గుతోందనే అనుకుందాం. దానిపై టీడీపీ తాత్సారం చేసిందే అనుకుందాం. ఈ విషయం తెలిసి కూడా ఇన్నాళ్లూ వైకాపా చేసిన పోరాటం ఏది..? కడప ఉక్కు గురించి మాట్లాడిన సందర్భమేదీ..? నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసమే పోరాటం పోరాటం అన్నారు. అంతేగానీ, రైల్వేజోన్, జిల్లా ప్యాకేజీలు వంటివాటిపై వైకాపా ఎంపీలుగానీ, జగన్ గానీ మాట్లాడిన దాఖలాలు ఎక్కడున్నాయి…? వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసిందే సింగిల్ పాయింట్ అజెండా.. ప్రత్యేక హోదా సాధన కోసం. అలాగనే కదా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ జాబితాను రోజా పొడిగించి.. కడప ఉక్కు ఫ్యాక్టరీ మొదలుకొని అన్ని అంశాలపైనా పోరాటం చేసేశామని చెప్పుకుంటున్నారు. వైకాపా పోరాటం రాజీనామాలతో పూర్తయిపోతే.. ఏదో ఒక ఫలితం ఉండాలి కదా..? కేంద్రంపై వైకాపా ఎంపీలు చేసిన రాజీనామాల వల్ల కలిగిన ఒత్తిడేదీ..? ఆ రాజీనామాలు చేయకుండా ఉంటే.. కనీసం వచ్చే నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఏపీ ప్రజల వాణిని వినిపించే మరో అవకాశం వచ్చేది కదా! కనీసం ఈసారైనా తమ చిత్తుశుద్ధిని నిరూపించుకునేందుకు ఆస్కారం ఉండేది.