శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా తిత్లీ తుఫాను బాధితుల గురించి మాట్లాడారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రాలో సమస్యలు దారుణంగా ఉంటే, పక్క రాష్ట్రం తెలంగాణలో ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి అక్కడికి పోతారని ఎద్దేవా చేశారు. తిత్లీ తుఫాను వల్ల ఒక్క ఎచ్చర్ల మండలంలోనే దాదాపు 12 వందల ఎకరాలు నష్టపోతే, దాన్ని 4 వందల ఎకరాలకు చంద్రబాబు ప్రభుత్వం కుదించిందని ఆరోపించారు. తిత్లీ బాధితులకు చంద్రబాబు నాయుడు చేసిందేంటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలు వస్తే… ప్రజలను కాపాడాలని ఏ ముఖ్యమంత్రి అయినా చూస్తారనీ, తుఫాను రాకముందే ఎలా తోడుగా ఉండాలని ఆలోచిస్తారన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆహారం సరఫరా చేస్తారనీ, పక్క రాష్ట్రం ఒడిశాలో ఇవన్నీకనిపిస్తాయనీ, కానీ మన రాష్ట్రంలో ఇవేవీ కనిపించవని విమర్శించారు.
తిత్లీ వల్ల మూడు వేల కోట్లకుపైగా నష్టం వచ్చింది కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారనీ, ఇంత నష్టం వచ్చిందని చెబుతున్నప్పుడు… ప్రజలకు ఎంత డబ్బులు ఇచ్చావని ప్రశ్నిస్తున్నా అన్నారు జగన్. జరిగిన నష్టంలో 15 శాతం మాత్రమే ఇచ్చారనీ, అలా వచ్చిన సొమ్ములో కనీసం సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. కానీ, తిత్లీ బాధితులను గొప్పగా ఆదుకున్నాను అంటూ భారీ ఎత్తున చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. శ్రీకాకుళం నుంచి ఏ బస్సుపోయినా చంద్రబాబు ఫొటో కనిపిస్తుందనీ, బాధితులను ఆదుకున్నట్టుగా గొప్పగా విజయవాడలో ఫ్లెక్సీలు పెడతారీ పెద్ద మనిషి అన్నారు. ఎక్కడ చూసినా ఆయన ఫొటోలేననీ.. శవాల మీద చిల్లర ఏరుకుంటున్నట్టుగా ఆయన తీరు ఉందంటూ ఎద్దేవా చేశారు.
తిత్లీ తుఫాను వస్తుందని తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక ముందస్తు చర్యలు చేపట్టింది. ఆ విషయం జగన్ కి గుర్తులేకపోవచ్చు. అంతేకాదు, తుఫాను వచ్చిన మర్నాటి నుంచే సహాయక చర్యలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బాధితుల తరఫున ఇంతగా మాట్లాడుతున్న జగన్… ఆ సమయంలో ప్రజలను పరామర్శించడానికి ఎందుకు శ్రీకాకుళం జిల్లాకి రాలేకపోయారు..? ముఖ్యమంత్రితో సహా మంత్రులూ ఉన్నతాధికారులు అందరూ శ్రీకాకుళం జిల్లాకి వచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. కానీ, జగన్ పక్క జిల్లాలో పాదయాత్ర చేశారే తప్ప… ఆ యాత్రకి రెండ్రోజులు బ్రేక్ ఇచ్చి, బాధితులను ఆదుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు..? అంతేకాదు, తిత్లీ బాధితులను ఆదుకునేందుకు విరాళాలు ఇస్తే, వాటిని అధికార పార్టీ నేతలు దుర్వినియోగం చేస్తారని కూడా వైకాపా ఎమ్మెల్యే రోజా అప్పట్లో మాట్లాడారు. ఇదేనా బాధితులపై వారికి ఉన్న ప్రేమంటే..? తిత్లీ తుఫాను నష్టాన్ని కేవలం ఒక రాజకీయాంశంగా మాత్రమే జగన్ చూస్తున్నారనడానికి ఆయన స్పందనే సాక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలోకి పాదయాత్ర వచ్చాకనే ఇప్పుడు బాధితులు గుర్తొచ్చారా..? జరిగిన నష్టంపై అంత ఆవేదన ఉంటే… బాధితుల తరఫున కేంద్రాన్ని వైకాపా కూడా గట్టిగా డిమాండ్ చేస్తే బాగుండేది కదా! ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని, చేపట్టిన నష్ట నివారణ కార్యక్రమాలను ఇప్పుడు తీరిగ్గా విమర్శించడం అనేది ఫక్తు రాజకీయం తప్ప, ఇంకేమనాలి..?