యూపీలో ఉన్న అఖిలేష్‌కీ ఏపీలో లోకేష్‌కీ ఏంటి సంబంధం అనేగా మీ అనుమానం! సంబంధం లేదుగానీ సాపత్యం ఉందని చెప్పాలి. ఎలా అంటే.. యూపీలో ములాయం కుమారుడు ముఖ్యమంత్రి అయిపోయారు. కానీ, ఏపీలో సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి కూడా కాలేకపోయారు అనే అభిప్రాయం తెలుగుదేశం శ్రేణుల్లోనే వినిపించేంది. లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ మాంచి పీక్స్‌లో ఉన్న తరుణంలో ఈ పోలికను తమ్ముళ్లే తెరపైకి తెచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దసరా పండుగకు లోకేష్ మంత్రి అయిపోతారని అనుకున్నారు. మధ్యలో దీపావళి దాటేసి సంక్రాంతి కూడా వచ్చేస్తోంది. ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండొచ్చనీ, అప్పుడు లోకేష్‌ను మండలి సభ్యునిగా చేసి, మంత్రిని చేస్తారన్న ఊహాగానాలు కూడా నెమ్మదిగా నీరుగారిపోయాయి.
అప్పట్లో అఖిలేష్‌తో లోకేష్‌ను పోల్చుతూ చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైకాపాకు ప్రధాన విమర్శనాస్త్రంగా ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలుస్తున్నవే. తండ్రి ములాయం, కుమారుడు కమ్ సీఎం అఖిలేష్ మధ్య చోటు చేసుకున్న రాజకీయ రాద్ధాంతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరుణంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రోజా ఒక కొత్త లాజిక్‌తో విమర్శలు చేశారు. నారా లోకేష్‌కు తండ్రి చంద్రబాబు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదో ఉత్తరప్రదేశ్ పరిణామాలను పోల్చుతూ విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని రోజా ఎద్దేవా చేశారు. అక్కడి అఖిలేష్ యాదవ్ మాదిరిగానే ఆంధ్రాలో తన కుమారుడు లోకేష్ కూడా ఎప్పుడైనా ఎదురుతిరిగే ప్రమాదం ఉందని చంద్రబాబుకు ఆందోళన చెందుతున్నారంటూ రోజా విమర్శించారు. లోకేష్ వల్ల తనకు అధికారం ఎక్కడ దూరం అవుతుందో అనే భయం ఆయనకు పట్టుకుందని అన్నారు. కేవలం ఈ భయం వల్లనే తన కుమారుడు లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారంటూ రోజా చెప్పారు. లోకేష్ మంత్రి పదివి ఆలస్యం కావడానికి రోజా చెప్పిన కొత్త లాజిక్ ఆసక్తికరంగానే ఉంది.