ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఏమవుతుంది..? సింపుల్‌గా జగన్ దగ్గర రిమార్కులు పడతాయి. అంటే.. ఇమ్మీడియట్‌గా మంత్రి పదవి రేసులో ఉంటే.. ఆ రేసు నుంచి తప్పించేస్తారు. ఒక వేళ మంత్రి పదవిలో ఉండే ఆ మంత్రి పదవినే ఊడగొడతారు. ఓ వేళ మంత్రిగా లేకపోయినా… మంత్రి పదవి రేసులో లేకపోతే.. కాస్త లేటుగా.. ఎమ్మెల్యే టిక్కెట్‌కు గండి పెడతారు. దీంతో తప్పనిసరిగా గెలిపించాల్సిన పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యేలపై పడింది. ఇదే నగరి ఎమ్మెల్యే రోజుకు గండంగా మారింది. ఆమె నియోజకవర్గంలో రెండు మున్సిపాల్టీలు ఉన్నాయి. ఒకటి పుత్తూరు.. మరొకటి నగరి. అలాగే.. ఆమె పార్టీలో ఆమెకు.. రెండు గ్రూపులున్నాయి. పార్టీని ఓడించి… రెబల్స్‌ను గెలిపించడానికి ఆమె ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రోజు జరిగిన పోలింగ్‌లో ఆమె అభ్యర్థులంతా వెనుకబడి ఉన్నారని అనుకుందో ఏమో కానీ.. కంటి తడి పెట్టుకుని మీడియా ముందుకు వచ్చేసింది. నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ రోజాకు బద్ద వ్యతిరేకి. ఆమె కూడా అంతే. రోజా అధికారిక అభ్యర్థుల్ని నిలబెడితే కేజే కుమార్ తన అభ్యర్థుల్ని రెబల్స్‌గా నిలబెట్టారు. అక్కడ ఆయనకే పట్టు ఉంది. దాంతో రోజా అభ్యర్థులు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. చివరికి.. తన అవకాశాలకు ఎక్కడ గండి కొడుతుందోనని ఆమె కన్నీరు పెట్టుకుని మీడియా ముందుకు వచ్చారు. అసలే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పుడు తన నియోజకవర్గంలో మున్సిపాల్టీల్లో ఓడిపోతే ఆ పదవి రాదు. అలా రాకుండా చేయడానికి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారని చాలా కాలంగా రోజా అనుమానంతో ఉన్నారు. ఒకే జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికి రెండు మంత్రి పదవులు ఉండే చాన్స్ లేదు. అందుకే పెద్దిరెడ్డి తన కోసం.. రోజాను మైనస్ చేస్తున్నారని అంటున్నారు. ఈ గ్రూపు రాజకీయాలతో రోజాకు కన్నీళ్లే మిగులుతున్నాయి. చివరికి జగన్ కూడా.. మంత్రి పదవిని తిరస్కరించి..మరోసారి కన్నీళ్లే దిక్కయ్యేలా చేస్తారో.. ఆమె పోరాటానికి మంత్రి పదవి ఇస్తారో వేచి చూడాలి..!