ఇదివరకు ఒకసారి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన ఎంపిలు ప్రత్యేక హోదా తదితర హామీలను సాధించడం కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడకుండా తమ వ్యాపారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఒకవేళ వారికి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే ఆసక్తి లేకపోయినట్లయితే తక్షణమే వారందరూ తమ పదవులకు రాజీనామా చేసి తప్పుకొంటే వారి స్థానంలో సమర్దులయిన వారిని ఎన్నుకొంటామని అన్నారు. అందుకు తెదేపా ఎంపిలకు చాలా రోషం వచ్చేసింది. అందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ కి చాలా ఘాటుగా జవాబు చెప్పారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. అయితే అది పవన్ కళ్యాణ్ అభిప్రాయమన్నట్లు వారు భావించారే తప్ప ప్రజాభిప్రాయంగా భావించినట్లు లేదు. అందుకే నేటికీ ఏ ఒక్క హామీ అమలు కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ తమని ఉద్దేశ్యించి అంత తీవ్రంగా విమర్శించిన తరువాత కూడా వారిలో ఏమి చలనం కలగలేదని స్పష్టం అయ్యింది.
ఆనాడు తెదేపా ఎంపిల గురించి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలనే వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా మళ్ళీ నిన్న చేసారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వైజాగ్ లో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చినప్పుడు ఆమె తెదేపా, భాజపా ఎంపిలను దద్దమలని తీవ్రంగా విమర్శించారు.
“వారికి వ్యాపారాల మీద ఉన్నంత శ్రద్ధ రైల్వే జోన్ సాధించడంపై లేదు. అందుకే రెండేళ్ళవుతున్నా కేంద్రప్రభుత్వం ఆ హామీని పట్టించుకోవడంలేదు. రైల్వే జోన్ అంటే అదేదో విశాఖ నగరానికి సంబంధించిన విషయం కాదు. యావత్ రాష్ట్రానికి సంబంధించినది. మరి తెదేపా, భాజపా ఎంపిలు దాని గురించి కేంద్రప్రభుత్వాన్ని పార్లమెంటులో గట్టిగా ఎందుకు నిలదీయడం లేదు? వారికి తమ వ్యాపారాలు, పార్టీ ప్రయోజనాలే ముఖ్యం తప్ప ప్రజలు, రాష్ట్రం కాదు. అటువంటివారికి ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెపుతారు,” అని రోజా విమర్శించారు.
పవన్ కళ్యాణ్ తెదేపా-బీజేపీలకి స్నేహితుడు కనుక ఆయన చేసిన విమర్శలకి తెదేపా గట్టిగా సమాధానం చెప్పలేకపోయింది. కానీ రోజా వైకాపాకి ఎమ్మెల్యే కనుక ఆమెకు ఘాటుగా జవాబు చెప్పడానికి తెదేపా నేతలకి ఎటువంటి ఇబ్బందీ ఉండబోదు కనుక నేడో రేపో వారు ఆమెపై విమర్శలు గుప్పించవచ్చు.
తమను ప్రశ్నించేవారిపై తెదేపా నేతలు గట్టిగా ఎదురుదాడి చేసి వాళ్ళ నోళ్ళు మూయించవచ్చు. కానీ ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీలన్నీ ఎప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోతే, వచ్చే ఎన్నికలలో తెదేపా, భాజపాలే అందుకు మూల్యం చెల్లించుకోవలసి రావచ్చునని గ్రహిస్తే మంచిది.