నగరి నియోజకవర్గం నుంచి మాత్రమే తాను పోటీ చేస్తానని ఒంగోలు ఎంపీగా పోటీ చేసేది లేదని మంత్రి రోజా చెబుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన లీకులతో ఆమె షాక్ కు గురయ్యారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం ఏమిటని ఆమె మథనపడ్డారు. ఇదే విషయంపై స్పందించారు. తాను నగరి నుంచే పోటీ చేస్తానని ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు
నగరి నుంచి రోజాను వెళ్లగొట్టడమే లక్ష్యంగా పెద్దిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కు కూడా ఆమెకు మళ్లీ టిక్కెట్ ఇవ్వడం ఇష్టం లేదు. నగరి నియోజకవర్గంలో గ్రూపులకు కొదవలేదు. కానీ రోజా నోటికి భయపడి టిక్కెట్ లేదని చెప్పలేకపోతున్నారు. ఎంపీ టిక్కెట్ విషయంలో అందుకే లీక్ చేశారు. కానీ రోజా మాత్రం ఇదో పెద్ద ట్రాప్ అని అర్థం చేసుకున్నట్లుగా ఉన్నారు. అందుకే ఎంపీగా పోటీ చేసేది లేదని.. నగరిలో మాత్రమే పోటీ చేస్తానంటున్నారు.
బొత్స భార్య ఝాన్సీలక్ష్మిని విశాఖ ఎంపీ స్థానానికి ఇంచార్జుగా నియమించేటప్పుడు మొదట మీడియాకే లీకులు ఇచ్చారు. బొత్సకు కూడా తెలియదు. తర్వాత నియమించారు. ఇప్పుడు బొత్సకు సీటు ఉందా లేదా అన్నది క్లారిటీ లేదు. అనిల్ కుమార్ పరిస్థితి కూడా అదే. చివరికి రోజా విషయంలోనూ మీడియా లీకులు ఇచ్చారు. ఇప్పుడు లీకులకు తగ్గట్లుగా ఒంగోలు అభ్యర్థిగా రోజాను ఖరారు చేస్తారా లేకపోతే ఆమె నోటికి భయపడి.. నగరి టిక్కెట్ ఖరారు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.