హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో నిన్న, మొన్న ప్రభుత్వంపై విరుచుకుపడి సభను అల్లకల్లోలం చేసిన ప్రతిపక్షనేత జగన్ పాత్రను ఇవాళ ఆ పార్టీ నాయకురాలు రోజా పోషించినట్లు కనబడింది. ఇవాళ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కావటంతో జగన్మోహన్ రెడ్డి తన కుటుంబసభ్యులతోసహా పులివెందుల వెళ్ళి తండ్రి సమాధివద్ద నివాళులర్పించారు. దానితో ఆయన ఇవాళ సభకు హాజరుకాలేకపోయారు. ఆ లోటును రోజా భర్తీచేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్థిని రిషితేశ్వరి కేసుపై రోజా ప్రభుత్వంమీద నిప్పులు చెరిగారు. రిషితేశ్వరి మృతికి టీడీపీయే కారణమని ఆరోపించారు. ర్యాగింగ్, లైంగిక వేధింపులే రిషితేశ్వరిని చంపేశాయని బాలసుబ్రహ్మణ్యం కమిటీ తేల్చిందని, ముగ్గురిని అరెస్ట్ చేసి పనైపోయినట్లు ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని రోజా అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే మహిళలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్‌కు టీడీపీ కొమ్మకాస్తోందని ఆరోపించారు. ఆడపిల్లల ప్రాణాలంటే టీడీపీ ప్రభుత్వానికి విలువ లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ కరవు వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో కరవులేకుండా వర్షాలు పడ్డాయని అన్నారు. అసెంబ్లీ లాబీలో వైఎస్ ఫోటోను తీసి ఉండొచ్చుగానీ ప్రజల గుండెల్లోనుంచి తీసివేయలేరని చెప్పారు. వైఎస్ పంచెకట్టుచూసి టీడీపీ నేతలకు పంచెలు తడుస్తున్నాయని రోజా అన్నారు.