వైకాపా ఎమ్మెల్యే రోజా తన సస్పెన్షన్ వ్యవహారంపై శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఆమె సుదీర్గంగా మాట్లాడిన మాటల సారాంశం ఏమిటంటే, నేను కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి శాసనసభలో చర్చకు పట్టుపట్టినందున, దానిపై చర్చ జరిగితే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతోనే నాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష కట్టి ఏడాదిపాటు సస్పెండ్ చేయించారు. కనీసం నాకు సంజాయిషీ చెప్పుకొనే అవకాశం కూడా ఇవ్వలేదు. అనిత విషయంలో నేను తప్పుగా మాట్లాడలేదు. మాట్లాడానని నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దం. తప్పు మాట్లాడనప్పుడు క్షమాపణలు కోరితే, చేయని తప్పుని అంగీకరించినట్లవుతుంది. ఈసారి సభా హక్కుల కమిటీ ముందు హాజరవుతాను కానీ క్షమాపణలు కోరను. ఒకవేళ నాపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే న్యాయపోరాటం చేస్తాను. క్షమాపణలు కోరిన కొడాలి నానిని క్షమించని వాళ్ళు నేను క్షమాపణ చెపితే క్షమిస్తారనుకోను.
నేను కాల్ మనీ గురించి అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసారు. నన్ను సభ నుంచి సప్సేండ్ చేయడానికి మరో కారణం కూడా ఉన్నట్లు తెలిసింది. అదేమిటంటే చంద్రబాబు నాయుడుకి నా మొహం చూడటానికి ఇష్టం లేదట. ఆయనకి ఇష్టలేని వాళ్ళు సభకు రాకూడదనుకొంటే, ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసేసి సభను నడిపించుకోవహ్చును కదా? ఆయన తనకిష్టం వచ్చినట్లు పాలించుకోదలిస్తే ఈ ఎన్నికలెందుకు? చట్ట సభలు ఎందుకు? అని రోజా ప్రశ్నించారు.
సభా హక్కుల ముందు అనిత పిర్యాదు వేరొక అంశానికి సంబందించినది. ఆ రెంటికీ ఒకదానితో మరొకదానికి సంబంధమే లేదు కానీ ఆ రెంటినీ కలిపేసి గందరగోళం సృష్టించి తద్వారా కాల్ మనీ అంశంపై నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు నాయుడు ఈ ఎత్తు వేశారు. కాల్ మనీపై చర్చ జరగాలని నేను పట్టినప్పుడు, సభలో డా. అంబేద్కర్ పై చర్చ మొదలుపెట్టడం కూడా అందుకే.
ఒకప్పుడు నేను తెదేపాలో ఉన్నప్పుడు నన్ను ఏవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు ఉసిగొల్పేవారో ఇప్పుడు అనితను కూడా అదేవిధంగా నాపై ఉసిగొల్పుతున్నారు. ఆనాడు మహిళా ఎమ్మెల్యేలను తన ప్రత్యర్ధులపై ఉసిగొల్పినపుడు కనబడని తప్పు ఇప్పుడు మేము ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే తప్పు ఎందుకు అవుతుంది? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఏవిధంగా పావుగా వాడుకొనేవరో ఇప్పుడు అనితని కూడా అలాగే వాడుకొంటున్నారు. తోటి మహిళ, సాటి శాసనసభ్యురాలు అయిన ఆమెపై నాకు ఎటువంటి కోపమూ లేదు. చంద్రబాబు నాయుడు చేతిలో ఆమె పావుగా మారిపోతోందేననే బాధ కలుగుతోంది. అంతే,” అని రోజా చెప్పారు.
రోజా సస్పెన్షన్ వ్యవహారం ఇన్ని రోజులుగా నడుస్తున్నా, ఇంతవరకు ఏనాడూ కూడా వైకాపా సభ్యులు ఎవరూ కూడా ఇప్పుడు రోజా ప్రస్తావిస్తున్న కాల్ మనీ వ్యవహారం ఊసు ఎత్తలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆ ఊసు ఎత్తడం చూస్తే బహుశః మళ్ళీ దానిని ఆయుధంగా చేసుకొని తెదేపాపై దాడికి వైకాపా సిద్దం అవుతోందేమో? అనే అనుమానం కలుగుతోంది.
రోజా శాసనసభ హక్కుల కమిటీ ముందు హాజరవుతానని చెప్పుతునప్పటికీ, క్షమాపణలు చెప్పను…న్యాయపోరాటం చేస్తానని చాలా స్పష్టం చేసారు కనుక ఆమెపై ఏడాది సస్పెన్షన్ ఖరారు అయినట్లే భావించవచ్చును. కనుక ఈ వ్యవహారంపై ఈ గొడవలు మరికొన్నాళ్ళు సాగుతూనే ఉండవచ్చును.