వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా కొంత కాలం గ్యాప్ తర్వాత… మళ్లీ తన వాగ్బాణాల రుచి చూపించారు. విశాఖపట్టణంలో పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాధ్ చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా పాల్గొన్న రోజా… విశాఖ రైల్వే జోన్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాన్ని నిశితంగా ఎండగట్టారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతపు మంత్రులను పేరుపేరునా రోజా విమర్శించారు. వారిలో ఎవ్వరికకీ రాష్ట్ర అబివృద్ధి, కనీసం ఉత్తరాంధ్ర ప్రాంత అబివృద్ధిపై శ్రద్ధ లేదని.. ఉంటే విశాఖ రైల్వేజోన్ ఎప్పుడో వచ్చేసేదని రోజా వ్యాఖ్యానించారు.
విశాఖకు రైల్వేజోన్ అనేది కేవలం విశాఖకు, ఉత్తరాంధ్రకు సంబంధించిన విషయం కాదని, యావత్ రాష్ట్రానికి సంబంధించిన విషయం అనే సంగతిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో వైకాపా కృతకృత్యమైంది. అమర్నాధ్ దీక్ష ద్వారా మరింత మైలేజీ సాదించాలని వైకాపా అనుకుంటోంది. జగన్ దీక్షలో పాల్గొనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉన్నప్పటికీ.. ఆదివారం నాడు రోజా వచ్చారు.
దీక్షా శిబిరంలో ఆమె తన ప్రసంగంలో ప్రత్యేకించి విశాఖ పట్నంనుంచి ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావును ఓ రేంజిలో విమర్శించారు. సినిమా ఫంక్షన్లలో తిరుగుతూ ఉండడం, సరదాగా విదేశాలకు విహార యాత్రలు తిరుగుతూ ఉండడం తప్ప గంటా అసలు ప్రజలగురించి పట్టించుకోవడం లేదని రోజా దెప్పిపొడిచారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా శాసనసభలో అడ్డగోలుగా మాట్లాడడం తప్ప ప్రజలకు ఒరగబెడుతున్నది లేదని, కనీసం తమ ప్రాంతానికి రైల్వేజోన్ సాధించడంలోనూ శ్రద్ధ లేదని ఆరోపించారు.
మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని, జారుకుంటున్నారని వార్తలు వస్తున్న తరుణంలో.. అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైకాపా ఇమేజిని పెంచేలా జరుగుతున్న ఈ దీక్ష కొత్తగా మారదలచుకుంటున్న వారిలో పునరాలోచనను కలిగిస్తాయా? అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఎమ్మెల్యేల సంగతి ఎలా పోయినా.. ఈ ఉద్యమం ఉత్తరాంధ్రలో పార్టీ ఇమేజికి దోహదపడుతుందని అనుకుంటున్నారు