రాజ్యసభలో చర్చ.. అసలు ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇస్తున్నప్పుడు ఇక ప్రత్యేక హోదా ఎందుకు? అంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఏపీకి హోదా వ్యవహారం ఒక్కసారిగా మళ్లీ రాజుకుంది. దీనిమీద వాడిగా వేడిగా చర్చోపచర్చలు మళ్లీ మొదలయ్యాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీనే విఫలం అయిందంటూ సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తున్నది. అయితే ఈ విషయంలో ఇప్పుడు రోజా తెరమీదికి వచ్చి ప్రధానంగా పోరాడుతున్నారు. గతంలో జగన్ ఆలపించిన పాటలనే ఇప్పుడు రోజా అందుకున్నారు. కేంద్రంనుంచి తెదేపా బయటకు రావాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు.
భాజపా, తెదేపాల మధ్య ఎప్పుడెప్పుడు నిప్పు రాజేద్దామా అని ఎదురుచూస్తున్నట్లుగా వైకాపా ప్రవర్తించడం కొత్త కాదు. చాన్సు దొరికిన ప్రతిసారీ.. ఎన్డీయే నుంచి తెదేపా బయటకు రావాలి.. తెదేపాకు చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు రాజీనామాలు చేయాలి.. అని జగన్ ఎన్ని సార్లు డిమాండ్ చేశారో లెక్కే లేదు. దీనిపై ఆయనకే మొహం మొత్తినట్లుంది. ప్రస్తుతం హోదా గొడవ మళ్లీ వినిపిస్తుండగా, ఆయన డిమాండ్‌ను రోజా అందిపుచ్చుకున్నారు. కేంద్ర కేబినెట్‌నుంచి తెదేపా తప్పుకోవాలని ఆమె అంటున్నారు. అదే క్రమంలో వైకాపా హోదా కోసం పోరాడుతుందని కానీ సాధన బాధ్యత పూర్తిగా తెదేపా ప్రభుత్వానిదే అని ఆ పార్టీ ఎంపీ మేకపాటి హితవు చెబుతున్నారు.
రోజా విషయానికి వస్తే చంద్రబాబునాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి.. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కలిసి వెళ్లి ఢిల్లీ సర్కారు మీద పోరాటం చేస్తే హోదా వస్తుందని అంటున్నారు. జగన్ ఢిల్లీ దాకా దీనికోసం పోరాడాడని అంటున్న ఆమె.. ఇప్పుడు కొత్తగా అన్ని పార్టీలు కలిసి చేసినా సరే.. కేంద్రం ఎందుకు మెత్తబడుతుందని భావిస్తున్నారో తెలియడం లేదు. మొత్తానికి హోదా విషయంలో విఫలం అవుతున్నందుకు.. ఏం చేయాలో ఏం చేయరాదో.. చంద్రబాబుకు రోజా పక్కాగా గైడెన్స్ ఇచ్చేస్తున్నారన్నమాట.