రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు చెప్పేది ఒక్కటే మాట. అదే ‘ప్రజాసేవ’. వారు చేసేది ప్రజాసేవ కాదని, ‘స్వయం సేవ’ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని వారి చర్యలు, వ్యవహారశైలి చూస్తే అర్థమవుతుంది. ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చినవారు ఎన్నికల్లో గెలవాలనుకుంటారు. అదృష్టంకొద్దీ గెలవగానే ఏదో ఒక పదవి కావాలనుకుంటారు. వారున్న పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి సంపాదించుకోవాలని ఆశ పడతారు. అది దొరకలేదనుకోండి దానికి సమానమైన పదవి ఏదో ఒకటి కావాలనుకుంటారు. ఆ పదవి దేనికి? ప్రజాసేవ చేయడానికా? దాని ద్వారా, దాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి.
ఇలాంటివారికి పదవి అలంకారప్రాయం. అది వారికి ఫుల్‌టైమ్ వర్క్ కాదు. ఆ పదవిని పార్ట్‌టైమ్‌గా చేస్తూ ఇతర వ్యాపకాల్లో సంపాదించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మాజీ సినిమా హీరోయిన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్పర్సన్ రోజాకు బాగా వర్తిస్తుంది. సినిమాల్లో ద్విపాత్రాభియనం చేసినట్లుగా ఆమె ఒక పక్క ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా పదవిలో కొనసాగుతూనే ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న పాపులర్ షో ‘జబర్దస్త్’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది. రోజా నగరి ఎమ్మెల్యేగా రెండోసారి గెలవగానే అదృష్టం కొద్దీ ఆమె పార్టీ వైకాపా అధికారంలోకి వచ్చింది. దీంతో తన రొట్టె విరిగి నేతలో పడినట్లే అనుకుంది.
రొట్టె విరిగి నేతిలో పడటమంటే మంత్రి పదవి దక్కడమన్నమాట. ఎన్నికల ఫలితాల సమయంలో వైకాపా మెజారిటీ సాధిస్తోందన్న వార్తలు వెలువడుతున్నప్పుడే రోజాకు హోం మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు చెలరేగాయి. సామాజిక మాధ్యమాల్లో కాబోయే హోం మంత్రి రోజా అంటూ మారుమోగిపోయింది. కాని సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని జగన్ రోజాకు మంత్రి పదవి ఇవ్వలేదు. పదవి దక్కనందుకు ఆమె అలిగింది కూడా. చివరకు ఆమెను సంతృప్తిపరచడానికి ఏపీఐఐసీ ఛైర్పర్సన్ పదవి ఇచ్చారు. కేబినెట్ హోదా కలిగిన పదవిలో ఉన్న రోజా ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా ఎంత నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నదో తెలియదు. కాని ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌లో మాత్రం చాలా సిన్సియర్‌గా పనిచేస్తోంది.
నిర్వాహకులు అందిస్తున్న భారీ పారితోషికానికి తగినట్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఆ కార్యక్రమాలు వెగటు పుట్టే హాస్యం కురిపిస్తున్నా నవ్వక తప్పదు కదా. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుతో కలిసి చాలాకాలంగా జబర్దస్త్ నిర్వహిస్తున్న రోజా ఇప్పుడు ఒంటరి అయిపోయిందని సమాచారం. నాగబాబును జీటీవీ లాగేసింది. వారు జబర్దస్త్వంటిదే ‘లోకల్ గ్యాంగ్స్’ అనే కార్యక్రమం పెట్టారు. జబర్దస్త్ కమెడియన్స్ కొందరు ఆ కార్యక్రమానికి వెళ్లిపోయారు. వారి బాటలో నాగబాబు కూడా నడిచాడు. ప్రస్తుతం నాగబాబు ప్లేసులో ఇంకా ఎవరూ రాలేదు.
రోజాకు ఇప్పటివరకు ఒక ఎపిసోడ్‌కు లక్షన్నర చొప్పున ఇచ్చారు. నాగబాబు వెళ్లిపోయాక ఈమె కూడా అదే పనిచేస్తుందేమోనని అనుమానపడి లక్ష రూపాయలు పెంచారట…! ఈమెకు ఈ కార్యక్రమం ద్వారా బాగానే ముడుతోంది. ఇక ఆమె ఏపీఐఐసీ ఛైర్పర్సన్ కాబట్టి అందుకుగాను నెలకు సుమారు 4 లక్షలు వస్తాయి. ఆమె ఎమ్మెల్యే కాబట్టి అందుకు నెలకు లక్షా పాతిక వేల జీతం వస్తుంది. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా ఉచిత సౌకర్యాలు కొన్ని ఉంటాయి. మొత్తం మీద రోజా పని హాయిగా ఉంది. సినిమాల్లో నటించకపోయినా ఆదాయానికి తక్కువ లేదు. జబర్దస్త్‌గా బతికిస్తోంది.