మంత్రి రోజా పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంది. పార్టీ అధినేత జగన్ మనసును మెప్పించేందుకు ఆమె తన క్యారెక్టర్‌ను సైతం దిగజార్చుకుని మరీ ప్రవర్తిస్తున్నారు. కానీ ఆమెకు వ్యతిరేకంగా పార్టీ నేతలను హైకమాండ్ ప్రోత్సాహిస్తోంది. నగరిలో జరుగుతున్న రాజకీయం ఆమెకు నిద్రపట్టనీయడం లేదు. నగరి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు రోజా లేకుండానే జరిగిపోతున్నాయి. తాజాగా ఆర్బీకేకు పార్టీ నేతలంతా కలిసి శంకుస్థాపన చేశారు. దీనికి రోజాను పిలువలేదు. దీంతో ఆమె తన ఆవేదన ఫోన్లో ఎవరితోనో చెప్పుకుని మీడియాకు లీక్ చేయించారు.
తాను ప్రాణలు పణంగా పెట్టి రాజకీయం చేస్తున్నామని కానీ తమను పట్టించుకోవడం లేదని..తన వ్యతిరేకుల్ని ప్రోత్సహిస్తున్నారన్నది ఆమె ఆవేదన. నగరి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో కీలక నేతలు రోజాకు వ్యతిరేకంగానే ఉన్నారు. వారెవరూ రోజా పేరెత్తరు. ఫ్లెక్సీలు పెడితే కనీసం ఫోటో కూడా పెట్టరు. నగరి మున్సిపల్ చైర్మన్ సహా అందరూ వ్యతిరేకమే. చాలా సార్లు ఈ విషయాలపై గొడవలు జరిగాయి. కానీ రోజా చేయగలిగిందేమీ లేకపోయింది.
రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామంచ్రారెడ్డి మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న వారంతా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే. రోజాకు మంత్రి పదవి కూడా.. ఆమె నోటికి భయపడే ఇచ్చారని చెబుతారు. ఒక వేళ పదవి ఇవ్వకపోతే ఆమె చేసే రచ్చతో పరువుపోతుందని భయపడి ఇచ్చారని.. కానీ ఆమెకు చెక్ పెట్టడానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు. మొత్తంగా విశాఖ విమానాశ్రయంలో రోజా వేళ్లు చూపించి రెచ్చగొట్టారని.. అదే పని. రోజాకు నగరి నాయకులు కౌంటర్‌గా ఇస్తున్నారన్న సెటైర్లు పడుతున్నాయి.