కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేది చాలా పెద్ద ఇష్యూనే కావొచ్చు. కానీ రోజా రియాక్షన్స్‌పై మాత్రం అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి. రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయడాన్ని సమర్థించనవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోతున్నాయి. మరో ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేసే దిశగా సాగుతున్న టిడిపి ప్రయత్నాలపై విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. రోజా తప్పు చేసిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయడం కోసం చంద్రబాబుతో సహా టిడిపి వాళ్ళందరూ బాగానే కష్టపడ్డారు. అందుకే ఇప్పటివరకూ ఆ విషయంపైనే టిడిపిని పూర్తిగా తప్పు పట్టినవాళ్ళు ఎవరూ లేరు. ఇరువైపుల నుంచీ తప్పు ఉందనే పొలిటికల్ ఎనలిస్టులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు రోజా శిక్షను పొడిగించడాన్ని మాత్రం ఎక్కువమంది విమర్శిస్తున్నారు. ఒకవేళ రోజాను రెండేళ్ళపాటు శిక్షించడం తప్పుకాదు అని టిడిపి సమర్థించుకున్నా…వాళ్ళు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి.
‘రేయ్..ఏరా..పాతేస్తా…నా కొ…’అన్న టిడిపి సభ్యుడిని ఎందుకు వదిలేశారు? రోజా చేసిన తప్పుకు రెండేళ్ళపాటు శిక్ష వేయాల్సినంత కఠినంగా క్రమశిక్షణా చర్యలు అమలు చేస్తున్న వాళ్ళు బోండాను మాత్రం ఎందుకు శిక్షించడం లేదు? అలాగే ఈ రోజు బిజెపి నేత విష్ణుకుమార్ రాజు, బోండా ఉమామహేశ్వరరావుల మాటలు కూడా చాలా చీప్‌గా ఉన్నాయి. ఆంటీ అన్న పిలుపు చుట్టూ వాళ్ళు మాటలు మాట్లాడిన మాటలు పోకిరీల చేష్టల్లాగే ఉన్నాయి. మాటలకంటే కూడా వెటకారపు నవ్వులు అయితే మాత్రం ఇంకా చీప్‌గా ఉన్నాయి. రోజా చేసిన తప్పును ఎవరూ సమర్థించరు కానీ టిడిపి నేతలు రెచ్చిపోతున్న విధానాన్ని మాత్రం ఇంకా ఎక్కువగా విమర్శించే అవకాశం ఉంది. టిడిపికి బిజెపి నేతలు కూడా వంత పాడుతుండడం దురదృష్టకరం. ఈ రెచ్చగొట్టే చర్యలు, స్థాయిని దిగజార్చుకుంటూ మాట్లాడుతున్న మాటలు, చేష్టలు…పైగా మరో ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేయాలన్న నిర్ణయాలు వెరసి చంద్రబాబునే కార్నర్ చేస్తున్నాయి. ఫైనల్‌గా రోజాకు సానుభూతి, టిడిపికి చెడ్డపేరు వచ్చేలా పరిస్థితులు టర్న్ అవుతున్నాయి. విషయాన్ని ఇంతటితో వదిలేస్తేనే చంద్రబాబుకు మంచిదని పొలిటికల్ ఎనలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు.