రోజా ఎపిసోడ్‌ను ప్రభుత్వం తెగేదాకా లాగుతున్నదా? వ్యవహారం సాగుతున్న క్రమాన్ని గమనించిన ఎవ్వరికైనా అలాగే అనిపిస్తుంది. ఎలాంటి పట్టుదలలకు పోతున్నారో.. ఎందువలన కోర్టు తీర్పు తర్వాత కూడా భీష్మించుకుంటున్నారో.. తద్వారా ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఉండగలవని అనుకుంటున్నారో సాధారణ అంచనాలకు అందడం లేదు. కాకపోతే… రాజకీయంగా రోజా ఎపిసోడ్ సాగతీత వలన తటస్తుల మద్దతును కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతున్నదని మాత్రం చెప్పకతప్పదు. సాధారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి స్నేహసంబంధాలు లేని.. వామపక్షాల నాయకులు కూడా రోజా ఎపిసోడ్ మీద ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తూర్పారపట్టేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సీపీఎం విషయానికి వచ్చినా వారికి వైకాపా పట్ల కాస్త సానుకూలత ఉన్నదని ఆపాదించవచ్చు. గతంలో ఆ పార్టీతో పొత్తులకు కూడా వారు ప్రయత్నించారనే పుకార్లు ఉన్నాయి. జగన్ దీక్షలకు, ఢిల్లీలో గతంలో చేసిన భేటీలకు సీపీఎం నాయకుల అండదండలు మద్దతు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే వైకాపా తో ఆ మాత్రం మైత్రి కూడా ఉన్నట్లు ఆనవాళ్లు లేని సీపీఐ కూడా సమానమైన స్థాయిలో రోజా ఎపిసోడ్లో ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతోంది.
ఆ రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు మధు రామకృష్ణలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతూ.. రోజా విషయంలో హైకోర్టు తీర్పు తర్వాత కూడా శాసనసభకు అనుమతించకుండా తెలుగుదేశం సర్కారు అనుసరిస్తున్న తీరు.. ఎమర్జన్సీని తలపిస్తున్నదంటూ విమర్శలు గుప్పించడం విశేషం. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ, పనిలో పనిగా చంద్రబాబును ఇంకా పలురకాలుగా తూలనాడేశారు.
ఎటూ విపక్షాలే గనుక.. వారి మాటలను పట్టించుకోవాల్సింది ఏముందిలే.. అంటూ తెదేపా డబాయించవచ్చు గాక… కానీ ప్రస్తుతానికి ఏపీలో రాజకీయంగా తటస్థ ముద్ర ఉన్న వామపక్షాలు చంద్రబాబును నిందించిన తీరు, స్థాయి, మోతాదు.. సామాన్య జనానికి కూడా ఎక్కకముందే.. అదే అభిప్రాయాలు సామాన్య జనానికి కూడా కలగక ముందే.. రోజా ఎపిసోడ్‌కు శుభం కార్డు వేస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు.