వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై కొనసాగుతున్న హై-సస్పెన్స్-డ్రామాకి నేడు ఏదో ఒక ముగింపు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆమె సస్పెన్షన్ పై స్టే జారీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని తెదేపా ప్రభుత్వం హైకోర్టు బెంచి వద్ద సవాలు చేసింది. ఆ కేసును హైకోర్టు బెంచి ఈరోజు విచారణకు చేపట్టబోతోంది. దానిపై ఈరోజు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆమెపై విదించిన సస్పెన్షన్ న్ని కొనసాగించమని సిఫార్సు చేస్తూ సభా హక్కుల సంఘం శాసనసభకు సమర్పించిన నివేదికపై ఈరోజు సభలో చర్చ జరుగబోతోంది. ఆమెతో బాటు వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఏవిధంగా ఉన్నప్పటికీ నేడు శాసనసభలో తీసుకొనే నిర్ణయాన్ని న్యాయస్థానాలు కూడా ప్రశ్నించలేవు కనుక అదే అంతిమ నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. కనుక రోజా, కొడాలి నాని ఇద్దరిపై సస్పెన్షన్ తప్పించుకోవడం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చును. ఆ తరువాత వారిరువురూ శాసనసభ నిర్ణయాన్ని న్యాయస్థానాలలో సవాలు చేయవచ్చును. కానీ అది వారికి మీడియా ప్రచారం కోసం, తెదేపా ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మాత్రమే ఉపయోగపడవచ్చును తప్ప వారి సస్పెన్షన్ ఎత్తివేసేందుకు అవకాశం కల్పించదనే చెప్పవచ్చును. ఈ సంగతి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ సభ్యులు అందరికీ తెలుసు. కనుక వారందరూ యధాప్రకారం ఈ అంశాన్ని వీలయినంతగా హైలైట్ చేసి దాని ద్వారా తెదేపా ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకతను సృష్టిస్తూ అదే సమయంలో తమ పార్టీకి ప్రజల సానుభూతి సంపాదించుకొనే ప్రయత్నాలు చేయవచ్చును. అయితే వైకాపా ఎంత హడావుడి చేసినప్పటికీ ఈ శాసనసభ సమావేశాలు ముగిసేవరకే దాని ప్రభావం కనిపిస్తుంది. ఆ తరువాత అందరికీ దానిపై ఆసక్తి తగ్గుతుంది కనుక అప్పుడు ఈ అంశాన్ని పక్కనబెట్టి మళ్ళీ అందరికీ ఆసక్తి ఉన్న మరో సమస్యపై వైకాపా పోరాటం మొదలుపెట్టక తప్పదు.