శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, జ్యోతుల నెహ్రూ, శ్రీధర్ రెడ్డి, కోటం రెడ్డిల అనుచిత ప్రవర్తనపై విచారణ చేసిన శాసనసభ హక్కుల కమిటీ ఈరోజు తన నివేదికను శాసనసభ స్పీకర్ కి అందజేసింది. ఒక్క రోజా తప్ప మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు క్షమాపణలు కోరినందున, వారిని సభలో మందలించి, వారిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టవచ్చునని సిఫార్సు చేసింది. కానీ నాలుగుసార్లు నోటీసులు పంపినా రోజా తమ ముందు హాజరవకాలేదని కనుక ఆమె తీరు మారలేదని భావిస్తూ ఆమెను ఏడాదిపాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలని నివేదికలో సిఫార్సు చేసారు. అంతేకాకుండా సస్పెన్షన్ కాలంలో ఆమెకు శాసనసభ సభ్యురాలికి ఇచ్చే ఎటువంటి అలవెన్సులను కూడా చెల్లించవద్దని సిఫార్సు చేసారు. కనుక రోజా సస్పెన్షన్ వేటు ఖరారయినట్లే భావించవచ్చును. కమిటీ ఇచ్చిన ఆ నివేదికపై సభలో కొద్దిసేపటి క్రితమే సభలో చర్చ మొదలుపెట్టారు.
తమ ఎమ్మెల్యే రోజాని సస్పెండ్ చేయమని సిఫార్సు చేస్తూ కమిటీ నివేదిక ఇవ్వడంతో వైకాపా సభ్యులు శాసనసభ సమావేశాలను బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు. రోజాపై సస్పెన్షన్ దాదాపు ఖరారవడంతో లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ పధకం గురించి చర్చిస్తున్నారు.ఈసారి శాసనసభ నిర్ణయాన్ని న్యాయస్థానాలు కూడా ప్రశ్నించలేవు కనుక, మొన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినందుకు తెదేపా ప్రభుత్వంపై కోర్టు ధిక్కారనేరంగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టుకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి.. ఈ వ్యవహారంలో వైకాపా ఇంకా ప్రచారం కోరుకొంటున్నట్లయితే సుప్రీం కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది.