వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాపై మరోసారి విమర్శలు గుప్పుమంటున్నాయి! నిజానికి, తెలుగుదేశం మీద ఆమె చేసే విమర్శలే చాలా తీవ్రంగా ఉంటాయి. నిత్యం ఏదో ఒక టాపిక్ తో మీడియాలో ఉంటారు. అలాంటి రోజా ఇప్పుడు ఎందుకు వార్తల్లో కనిపించడం లేదు..? నంద్యాల ఫలితం తరువాత ఆమె ఎందుకు స్పందించలేదు..? ప్రముఖ వైకాపా నేతలంతా ఓటమి గురించి మాట్లాడకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్ చేస్తుంటే, రోజా ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు..? నంద్యాల ఫలితంపై సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టేసి, ఎందుకు మమ అనిపించుకున్నారు..? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వైకాపా శ్రేణుల్లో ఎమ్మెల్యే రోజాపై చర్చ జరుగుతోందని సమాచారం. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఆమె చేసిన విమర్శలు టీడీపీ మెజారిటీ పెంచడానికి కారణమయ్యాయనే అభిప్రాయాలు వైకాపా వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయట! మంత్రి భూమా అఖిల ప్రియపై ఆమె చేసిన కామెంట్లు వైకాపాకి వ్యతిరేకంగా పనిచేశాయని అంటున్నారట. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారనీ, అలాంటి పార్టీలో మంత్రిగా ఉంటూ చీరా బొట్టు పెట్టుకోకుండా, మగాడిలా చుడీదార్ వేసుకుని వెళ్లే అఖిల ప్రియ సంప్రదాయాల గురించి మాట్లాడటం ఏంటని రోజా ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. తండ్రి మరణించిన వెంటనే పదవుల కోసం పరుగులు తీసిందంటూ చేసిన విమర్శలు వైకాపాకి ఇబ్బందిగా మారాయనేది ఆ పార్టీ వర్గంలోనే ఇప్పుడు చర్చనీయం అవుతున్నట్టు చెబుతున్నారు.
ఇంకోపక్క, సోషల్ మీడియాలో రోజా చేసిన ఛాలెంజ్ పై చాలా అభిప్రాయాలు చక్కర్లు కొడుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోతే గుండు కొట్టించుకుంటా అంటూ ఆమె చేసిన సవాలు వివాదానికి కారణమైంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రోజాకు గుండు కొట్టించినట్టు ఉండే ఓ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. దీంతో అక్కడ వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసినవారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకోపక్క… ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా నంద్యాలలో వైకాపా ఓటమికి రోజా అతి విమర్శలే కారణం అని కుండబద్దలు కొడుతున్నారు. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ఓ టీవీ ఛానెల్ లో నంద్యాల ఫలితాలను విశ్లేషిస్తూ.. రోజా తీరు వల్లనే టీడీపీకి మెజారిటీ పెరిగిందని అన్నారు. ఈ విషయాన్ని వైకాపా గుర్తించకపోతే ఎవ్వరూ ఏం చేయలేరంటూ ఆయన స్పందించారు. తండ్రి మరణించాక, శాసనసభలో నివాళ్లు అర్పిస్తుంటే అఖిల ప్రియ అక్కడికి వెళ్లడాన్ని రోజా విమర్శించడం తగదన్నారు. ఈరోజుల్లో అందరూ చుడీదార్లు వేసుకుంటున్నారనీ, వాటిపై కూడా విమర్శలేంటని ఆయన చెప్పారు.
ఓవరాల్ గా నంద్యాల ఉప ఎన్నిక తరువాత వైకాపా ఎమ్మెల్యే రోజా తీరుపై మరోసారి విమర్శలు గుప్పుమంటున్నాయి. అందుకేనేమో రోజా మీడియా ముందుకు రాలేదు. తన ఫేస్ బుక్ పేజ్ లో ఒక పోస్టు పెట్టేసి.. జగనన్నా నీ వెంటే మేముంటాం, ఈ పోరాటంలో మేమూ సైనికులం అవుతాం అని సరిపెట్టేసుకున్నారు.