తిత్లీ తుఫాను వస్తుంటే ముందుగా దాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు, ముందస్తుగా ఎందుకు చర్యలు చేపట్టలేకపోయారు అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు వైకాపా ఎమ్మెల్యే రోజా..! తుఫాను తరువాత మొదటి మూడు రోజులూ సహాయక చర్చలు సరిగా జరగలేదన్నారు. ఆ ప్రాంతాల్లో ఫొటోలు తీసుకోవడానికి మాత్రమే మంత్రులూ టీడీపీ నేతలు వెళ్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా కూడా, రూ. 1 కోటి విరాళం ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేశారని గొప్పగా చెప్పారు!! కానీ, అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు సహాయక చర్యల విషయంలో విఫలమయ్యారు అన్నారు.
18 మండలాల్లో తుఫాను సర్వనాశనం చేసిందనీ, అయినా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నమే చంద్రబాబు చేస్తున్నారని రోజా విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు ప్రజలంతా బాధపడుతున్నారని రోజా చెప్పారు. గతంలో హుద్ హుద్ తుఫాను మాదిరిగానే, దీన్ని కూడా దగ్గరుండి తీరం దాటించినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని రోజా అన్నారు. హుద్ హుద్ తుఫాను సమయంలో వచ్చిన నిధుల్ని మింగేశారనీ, చిన్నచిన్న రిపేర్లు కూడా అప్పుడు చేయించలేదని ఆరోపించారు. అందుకే, ఇప్పుడు సాయం చేద్దామన్నవారు కూడా ముందుకు రాకపోవడాన్ని గమనించాలన్నారు. కేరళకు నష్టం జరిగితే అందరూ పరుగెత్తారంటే… అక్కడి ప్రభుత్వంపై అందరికీ నమ్మకం ఉందనీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల బాధితులకు ఇచ్చిన సొమ్ము సరిగా వినియోగం కాదనే ఆలోచనతో చాలామంది ఉన్నారని రోజా చెప్పారు!
చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ఏదో ఒక అంశం దొరికితే చాలన్నట్టుగా ఉంటోంది రోజా తీరు..! తుఫానుని ముందుగా కనిపెట్టలేకపోయారా అనడం ఎంతటి హాస్యాస్పదం. సహాయక చర్యలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి అక్కడే ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటే… అవి ఫొటోల కోసం చేస్తున్న పనులు అంటే ఎలా..? బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్ విరాళం ఇవ్వడాన్నే గొప్పగా చెబుతున్నారు. కానీ, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు చేపడుతున్న చర్యలన్నీ ప్రచారార్భాట కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయా..? హుద్ హుద్ తుఫాను సమయంలో అత్యంత వేగంగా ప్రభుత్వం స్పందించబట్టే… విశాఖ నగరం అంతే వేగంగా కోలుకోగలిగింది. తిత్లీ అనంతరం జరుగుతున్నదీ అదే! చంద్రబాబు నాయుడు కారణంగానే విరాళాలు ఇచ్చేవారు ఇవ్వడం లేదని రోజా అనడాన్ని ఏమనాలి..?
ఇలాంటి సమయంలో సాయం చెయ్యండీ అంటూ ప్రజల తరఫున నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా..? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి, నిధులు ఇవ్వొద్దరంటూ పరోక్షంగా పిలుపునివ్వడాన్ని ఏమనుకోవాలి..? ఇలాంటి విపత్కర సమయాల్లో కూడా కేవలం రాజకీయాలను మాత్రమే చూడగలిగే గొప్ప సంస్కారం ఒక్క వైకాపాకి మాత్రమే ఉంది, అందునా ఇలా మాట్లాడగలిగే లక్షణం రోజాకి మాత్రమే ఉందనడంలో సందేహం లేదు!