రాజధాని అమరావతి విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తొలినుంచి ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ వ్యవహారాల్లో భారీ కుంభకోణాలు జరిగాయని, ఇందులో చంద్రబాబునాయుడు బినామీలు, మంత్రులకు సంబంధించిన బినామీలు అందరూ కలిసి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని సాక్షి దినపత్రిక రెండు రోజులుగా వరుస కథనాలు ప్రచురిస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మీడియా ముందుకు వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యే.. అమరావతి విషయంలో జరిగిన అవినీతి లెక్క కూడా తేల్చారు. ఈ భూ దందాల్లో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఆమె వివరించారు. చంద్రబాబునాయుడు తన నిజాయితీని నిరూపించుకోవాలంటే.. ఇప్పటికైనా ఆయన నోరు విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని హెచ్చరించారు.
చంద్రబాబు, లోకేష్ సహా, మంత్రులు, ఇతర తెలుగుదేశం కీలక నాయకులు భారీ ఎత్తున అమరావతి భూ కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లుగా కథనాలు వస్తున్నాయి. అయితే మాకు బినామీలను అంటగడతారా అంటూ బుధవారం నాడు తెదేపా మంత్రులు ఆగ్రహించిన సంగతి తెలిసిందే. మంత్రి నారాయణ లాంటి వారైతే.. నాకు బినామీ భూములు ఉన్నాయని నిరూపిస్తే మొత్తం పేదలకు ఇచ్చేస్తా అంటూ సవాళ్లు విసిరిన సంగతి కూడా తెలిసిందే. అయితే గురువారం రోజా తన ప్రెస్ మీట్లో భూములు ఎవరి పేరిట ఉన్నాయో.. వారికి అంతంత భూములు కొనే స్తోమత ఎలా వచ్చిందో సందేహాలు రేకెత్తిస్తూనే, ఆయా భూముల యజమానులకు ఏయే మంత్రులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో కూడా వివరించి చెప్పారు.
తన చేతికి వాచీ కూడా లేదని మాటలు చెప్పే చంద్రబాబు.. అమరావతి ప్రాంత రైతులకు చివరకు గోచీ కూడా లేకుండా చేశారని రోజా దెప్పి పొడిచారు. ఆ రకంగా చంద్రబాబు రైతులకు ద్రోహం చేస్తున్నారని చెప్పారు. ఆయన నోరు విప్పి ఈ భూ దందాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని రోజా డిమాండ్ చేశారు.