వైసీపీ ఓటమికి ఇంకా ప్రజలనే నిందించడం పనిగా పెట్టుకున్నారు ఆ పార్టీ నేతలు. ప్రజలకు మంచి చేశామని, అయినా గెలిపించలేదని నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు. తమకు విశ్వసనీయత ఉంది, ప్రజలే వెన్నుపోటు పొడిచారనే తరహాలో కథలు అల్లుతున్నారు. తాజాగా మాజీ మంత్రి రోజా ఓటమిపై స్పందిస్తూ ఈ తరహ వ్యాఖ్యలే చేయడం గమనార్హం.
“చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ.. మంచి చేసి ఓడిపోయాం. గౌరవంతో తలెత్తుకు తిరుగుదాం. ప్రజల గొంతుకై ప్రతి ధ్వనిద్ధాం” అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తప్పంతా ప్రజలదేనని రోజా ట్వీట్ సారాంశంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేసినా ఓట్లు వేయలేదని రోజా చెప్తున్నారంటే… ఎక్కడో ఓ చోట లోపం ఉండి ఉంటుంది. అంటే చేసిన మంచిని, పాలనను పక్కనపెట్టి ప్రత్యర్ధులపై ఎన్నడూ లేనంతగా కక్ష సాధింపు చర్యలకు దిగడమే ఎజెండాగా పెట్టుకోవడం వైసీపీ కొంపముంచి ఉండొచ్చు. కానీ , వీటిని పరిగణనలోకి తీసుకోకుండా మంచి చేసినా ప్రజలు ఓట్లు వేయలేదని నిందించడమంటే ప్రజాభిప్రాయాన్ని అవమానించడమే అవుతుంది.
నిజానికి, మంత్రిగా రోజా తన శాఖపై సమీక్షలు నిర్వహించడం కంటే ప్రత్యర్ధి పార్టీల నేతలపై విమర్శలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ భజన చేయడమే కర్తవ్యంగా పెట్టుకున్నారు. నగరిలో రోజా, ఆమె సోదరులపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయే మొదటి సీటు నగరి అని ఎన్నికలకు ముందు నుంచే విస్తృత ప్రచారం జరిగింది. అన్ని సర్వేలోనూ ఈసారి రోజాకు ఓటమి తప్పదని తేలినా జగన్ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆమెకే టికెట్ ఇచ్చారు.
నగరితో పాటు పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల స్వీయ తప్పిదాలతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడి ఓటమి పాలైన వైసీపీ… ఇంకా ఓటమికి ప్రజలదే తప్పంటూ ఆ పార్టీ నేతలు నిందించడం అవివేకం అవుతుంది అనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.