రోజా ఎప్పుడూ ప్రధాన మీడియాలో వచ్చి అవతలి పార్టీల మీద విరుచుకుపడేది. అయితే ఈ సారి కాస్త రూటు మార్చి తను కూడా కూడా సోషల్ మీడియా ద్వారా విమర్శలెక్కుపెట్టింది. నిన్న పవన్ కళ్యాణ్, పెందుర్తి లో దళిత మహిళ పై టిడిపి నేతలు గా చెప్పబడుతున్నవారు దాడి చేసిన అంశం పై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ట్వీట్లు చేసిన పవన్ ని లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు చేసింది రోజా .
నిన్న పవన్ ట్వీట్ చేస్తూ, పెందుర్తిలో మహిళ పై దాడి చేసినవారు టిడిపి వారని అంతా అంటున్నారని, దీనికి మీ వివరణ ఏంటి అంటూ టిడిపి ని ప్రశ్నించారు. అలాగే తాను వ్యక్తిగంతంగా వెళ్ళి ఆ మహిళని పరామర్శించడం వల్ల అధికారగణం మీద మరింత భారం ఒత్తిడి పడుతుందని వెళ్ళడం లేదని, రోహిత్ వేముల సమస్య లా ఇది కూడా జఠిలం కాకముందే ప్రభుత్వం స్పందించాలని కోరారు. టిడిపి, వైసిపి, బిజెపి లు రాజకీయపరమైన క్రెడిత్ ని పక్కన పెట్టి ఈ సమస్యపై దృష్టి సారించాలని చెప్పుకొచ్చారు. ఈ ఘటన మంగళవారం జరిగితే పవన్ శనివారం ట్వీట్ చేసారు. అలాగే యూరోప్ తదితర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఎన్నారై మహిళలు ఈ సమస్య గురించి తనకి మెసేజ్ చేసారని అన్నారు.
సరిగ్గా ఈ చివరి పాయింట్ ని అస్త్రంగా చేసుకుని, రోజా పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియా కేంద్రంగా వరస పోస్ట్ ల తో పవన్ పై దాడి చేసారు. రోజా ఏమన్నారంటే – “ఎవరో యూరప్ లో ఉన్న మహిళ నీకు మెసేజ్ చేసి సపోర్ట్ చేయమని అడిగే వరకు ఇక్కడ పుట్టిన నీకు ఒక ఆడపడుచుకు అవమానం జరిగింది అని తెలియకపోవడం సిగ్గు చేటు. సంఘటన జరిగిన మరుసటి రోజే అన్ని జిల్లాల్లో వైయస్ఆర్సీపీ మహిళా నాయకుల పోరాటం, పార్టీ అధినేత వైయస్ జగన్ గారు ప్రభుత్వంపై మండిపాటు, బాధితురాలికి న్యాయం చేసి నిందితులకు శిక్ష పడేలా విజ్ఞప్తి, సోషల్ మీడియాలో సైతం వైయస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తల పోరాటం చేసారు . అలాగే బాధితు రాలి కి 80గజాల భూమి,SC కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం, దళిత మహిళపై పైశాచికం చేసిన నిందితులకు శిక్షపడేలా పోరాటం, వైయస్ఆర్సీపీ చేస్తే ,అంతా అయిపోయాక 23వ తేది YSRCPకి క్రెడిట్ వస్తుందనే భయంతో కొందరు ట్విట్టర్ లో ప్రభుత్వాన్ని నొప్పించకుండా ట్వీట్లు” అంటూ పవన్ ని విమర్శించారు.
అయితే వైసిపి కి క్రెడిట్ వస్తుందనే భయం తో పవన్ ట్వీట్లు చేసాడని రోజా అంటుంటే, ఆవిడ పోస్ట్స్ కింద నెటిజన్లు కామెంట్ చేస్తూ, ఇలాంటి సమయాల్లో క్రెడిట్ కోసం వైసిపి మాత్రం ఎందుకు ప్రాకులాడుతోంది అంటూ రోజాని ప్రశ్నించారు.