హైదరాబాద్: రోజాపై సస్పెన్షన్ వివాదం మరింత ముదురుతోంది. సస్పెన్షన్ ఎత్తేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతుండగా, నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని మంత్రి యనమలు తేల్చి చెబుతున్నారు. ఇవాళ సమావేశం ప్రారంభం కాగానే రోజా సస్పెన్షన్ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని జగన్ స్పీకర్‌కు వీజ్ఞప్తి చేశారు. లేకుంటే తాము మూకుమ్మడిగా సభను బాయ్‌కాట్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ సమావేశాలను బాయ్‌కాట్ చేశారు. దీనితో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు జరుగుతున్నాయి. జగన్ ఇవాళ తన పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సీఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సస్పెన్షన్‌కు నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలు మొత్తం బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించారు. దీనిపై కోర్టుకు కూడా వెళతామని ప్రకటించారు. రేపు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు అటు ప్రభుత్వంకూడా ఏ మాత్రం తగ్గటంలేదు. ఏడాదికి ఒక్క రోజుకూడా సస్పెన్షన్ తగ్గించేది లేదని యనమల అన్నారు. దీనిపై కోర్టుకెళ్ళినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. తప్పుచేసినవారు సస్పెన్షన్ ఎదుర్కోవలసిందేనని అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసన మండలినుంచికూడా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.