రోజా సస్పెన్షన్ కేసులో నాలుగు అంశాలున్నాయి. మొదటిది– ఆమె ఆ రోజున శాసనసభలో చేసిన అనుచిత వ్యాఖ్యానాలు ప్రత్యేకించి తనను అవమానించారంటూ అనిత అనే దళిత మహిళా ఎంఎల్ఎ ఫిర్యాదు రెండు– ఈ సందర్భంగా ఆమెను ఏకంగా ఏడాది పాటు సభనుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం మంచి చెడ్డలు మూడు– నిర్ణయం తీసుకోవడంలో నిబంధనల పాటింపు లేదా ఉల్లంఘన నాలుగు– ఇప్పుడు న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తీసుకోవలసిన వైఖరీ చట్టసభల ప్రతిపత్తికి సంబంధించిన సమస్యలు.
రోజా ఆ రోజున సభలో చేసిన వ్యాఖ్యలు వ్యవహరించిన తీరును అందరూ ఖండించారు. అధికార పక్షమే తమను రెచ్చగొట్టిందనీ, అవతలివారి ప్రవర్తన చూపించకుండా తమను దోషులుగా చూపే భాగాలే లీకు చేస్తున్నారని వైసీపీ పదే పదే ఫిర్యాదులు చేసింది. అవన్నీ వాస్తవమే అనుకున్నా అధికార పక్షాన్ని కూడా ఖండించినా రోజా తీరు కూడా తీవ్రమైన పొరబాటే . దానికి ఆమెతో క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది కదా అంటే అది వరకు క్షమాపణ చెప్పి కూడా పదే పదే అలాగే చేస్తున్నదని అధికార పక్షం వాదన. మెజార్టి నిర్ణయంతో చర్య తీసుకోవడానికి అధికారమున్నా సమావేశ కాలానికి మించి సస్పెన్షన్ చేయడానికి నిబంధనలు అనుమతించడం లేదు. అది కూడా సభా హక్కుల సంఘానికి నివేదించి దాని సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకోవాలి. కాని సభ అత్యున్నతమైనదనే వాదనతో ఆ తతంగం లేకుండానే ఏకంగా ఏడాది పాటు ఆమెను సస్పెండ్ చేయడం తీవ్రమైన విషయమే. బండి ముందు గుర్రం వెనకలాగా నిర్ణయం అమలు ప్రారంభించి తర్వాత ఈ సమస్యపై ఒక సభా సంఘాన్ని నియమించారు. దాంట్లో ఎలాగూ అధికార పక్షానికే ఆత్యధిక ప్రాతినిధ్యం వుంది .రోజా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ి నిరాకరణ ఎదురైంది. ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లాక అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలపైనే హైకోర్టు మళ్లీ విచారణకు తీసుకుని అసెంబ్లీ నిర్ణయం సరైన నిబంధనల ప్రకారం జరగలేదని అభిప్రాయపడింది. అయితే ఇరుపక్షాల వాదనలు వినడానికి మరో నెల రోజుల గడువు నిస్తూ సస్పెన్షన్ నిర్ణయం అమలు తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.ఈ క్రమంలో న్యాయమూర్తి చట్టసభ అధికారాలను, నిర్ణయాలను కూడా పూర్తిగా గౌరవిస్తూనే మాట్లాడారు. పేర్కొన్న నిబంధనల ప్రకారం ఏడాది సస్పెన్షన్ చెల్లుతుందా లేదా అన్నదే విచారిస్తానని తెలిపారు.
ఏమిటిది యనమల గారూ..?
రోజా విషయంలోనూ ఏకంగా ఏడాది సస్పెండ్ చేసేందుకు ఇప్పుడున్న నిబంధనలు అవకాశమివ్వడం లేదు. ఇది స్పీకర్ తీసుకున్న నిర్ణయంగా గాక సభ తీసుకున్నదిగా శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టంగా చెప్పారు. అయితే అదే సమయంలో 340(2) నిబంధన కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించడం కుదరదని హైకోర్టు ఎత్తిచూపింది. దాని ప్రకారమైతే ఒక సమావేశం కాలానికి తప్ప సస్పెండ్ చేసే అవకాశముండదని తెల్పింది. మరి సభా వ్యవహారాలలో ఆరితేరినట్టు చెప్పే వారంతా ఇంత యథాలాపంగా తప్పు చేశారంటే ఎంత ఏకపక్షంగా అనాలోచితంగా నిర్ణయం తీసుకున్నారో తెలుస్తుంది. దీనికి మంత్రి యనమలపైన అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణపైన ముఖ్యమంత్రి ఆగ్రహౌదగ్రులవుతున్నారు గాని అసలు ఇంతటి గజిబిజికి దారితీసిన వైఖరిని పునరాలోచించుకోవడానికి సిద్దంగా లేరు. మొన్న ప్రభుత్వంపై అవిశ్వాసం, తర్వాత స్పీకర్‌పై అవిశ్వాసం చర్చల సందర్భంలో కూడా ఏకపక్షంగా నిబంధనలు సస్పెండ్ చేసి మూజువాణి ఓటుతో ఒకసారి, ఆ రోజుకు ఆ రోజే చర్చ చేపట్టి మరోసారి అయిందనిపించారు. వీటిని ముందుగా పసిగట్టలేకపోయిన ప్రతిపక్షం గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కూడా రాజ్యాంగం 212వ అధికరణం ప్రకారం చట్టసభల కార్యకలాపాలను కోర్టులలో సమీక్షించే అవకాశం లేదని చెబుతున్నది గనక దాన్ని ఆశ్రయించి పరువు దక్కించుకోవచ్చని అధికార పక్షం ఆశిస్తున్నది. అయితే అదే సమయంలో రోజాను రానివ్వకుండా లిఖిత పూర్వక ఆదేశాలిస్తే కోర్టులను ధిక్కరించినట్టవుతుంది గనక ద్విసభ్య బెంచి విచారణ కోరుతూ పిటిషన్ వేసి వ్యవధి పొందింది. ఈ లోగా రాజకీయంగా దళిత నేతలతో మాట్లాడించడం, సాంకేతికంగా సభలో మరో తీర్మానం ఆమోదించం చేస్తే సరిపోతుందని దాని ఆలోచనగా కనిపిస్తుంది. చేసిన పొరబాటుకు ఆమెకు శిక్ష విధించడం, దానిపై అందరి అనామోదం ఆక్షేపణలు రావడం జరిగిపోయింది. ప్రస్తుత సమావేశాలు కూడా పూర్తయిపోతాయి గనక కోర్టు ఉత్తర్వులపై తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పొచ్చు.లేదా క్షమాపణలు చెప్పింది రద్దు చేయొచ్చు. అంతేగాని ఈ ఘర్షణతో సభా సమయం వృథా చేయడం ఎవరికి లాభం? సోమవారంనాడు ఈచర్చ వచ్చినప్పుడు కూడా పెద్దగా కొత్త పరిష్కారాలు పరిస్థితులు వుంటాయని ఆశించలేము.