హైదరాబాద్: నగరి ఎమ్మెల్యే, తమ పార్టీ నాయకురాలు రోజాపై విధించిన సస్పెన్షన్ను వెంటనే వెనక్కు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు. ఈ మేరకు ఇవాళ ఆయన కోడెలకు ఆంగ్లంలో ఆరుపేజీలతో ఒక లేఖ రాశారు. రోజా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. నిబంధన 340 ప్రకారం రోజాపై సంవత్సరంపాటు సస్పెన్షన్ విధించారని, కానీ ఈ నిబంధన ప్రకారం సభ్యుడిని ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేయటానికి వీలుందని వాదించారు. నిబంధన 340 కింద చేపట్టే ప్రతి తీర్మానంపై స్పీకర్ తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహించాల్సిఉంటుందని, ఆ తీర్మానం ప్రకారం సభ్యుడిపై విధించే సస్పెన్షన్ కాల పరిమితి ఆ సభ సమావేశాల గడువుకు మించి ఉండరాదని పేర్కొన్నారు. రోజా సస్పెన్షన్ తీర్మానాన్ని ఆమోదించటం దురదృష్టకరమని, ఏపీ అసెంబ్లీ చరిత్రలోనే బ్లాక్ డే అని జగన్ ఉద్ఘాటించారు.