నోటిదుడుకు వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన రోజా స్పీకరు నిర్ణయం మీద హైకోర్టును ఆశ్రయించారు. తనను ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం హక్కు స్పీకరుకు లేవని.. తన సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా.. న్యాయస్థానం స్పీకరును ఆదేశించాలని కోరుతూ రోజా పిటిషన్ వేశారు. అసెంబ్లీ బిజినెస్ రూల్స్‌ను తన వాదనకు మద్దతుగా ప్రకటించిన రోజా.. సెక్షన్ల ప్రకారం.. మాగ్జిమం ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేయగలరని.. కానీ కోడెల శివప్రసాదరావు.. దురుద్ధేశంతో తనను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. తన పని తాను చేయలేకపోతున్నాను గనుక కోర్టు జోక్యం చేసుకోవాలన్నారు.
మార్చి 1 నుంచి జరగబోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే తనను సభకు అనుమతించేలా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలంటూ రోజా కోరుతున్నారు. అయితే శాసనసభ సభాపతి ఉత్తర్వుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోగలవా? లేదా? అనే విషయమై ఇప్పటికే అనేక సందేహాలు, సందిగ్ధాలు ఉన్నాయి. రాజ్యాంగ స్ఫూరి ్తకి పూర్తి విరుద్ధంగా వ్యవహరించినప్పటికీ కూడా.. స్పీకరు విధుల్లో తాము జోక్యం చేసుకోజాలమంటూ న్యాయస్థానాలు వెనక్కి తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. సూచన చేయగలమే తప్ప ఆదేశించలేం అని న్యాయస్థానాలు పేర్కొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రోజా సస్పెన్షన్‌పై స్పీకరు నిర్ణయం తప్పు అంటూ హైకోర్టు నుంచి తీర్పు రావడం కూడా కష్టమే అని పలువురు విశ్లేషిస్తున్నారు.
అయితే తనను సభలోకి రానిస్తారా లేదా అనే సంగతి పక్కన పట్టి, అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్న నేపథ్యంలో తన సస్పెన్షన్ వ్యవహారాన్ని మరింతగా రాద్ధాంతం చేయడం ఒక్కటే రోజా లక్ష్యంగా కనిపిస్తోంది. తనను సస్పెండ్‌చేసిన ఉత్తర్వులు కూడా తన చేతికి ఇవ్వలేదని, తమ పార్టీనేత జగన్ అడిగినా ఇవ్వలేదని, దాని మీద అసెంబ్లీ సబ్ కమిటీ వేశారే తప్ప.. ఇప్పటిదాకా ఏమీ తేల్చలేదని రోజా అంటున్నారు. అయితే బడ్జెట్ సెషన్స్ ప్రారంభం అయ్యాక.. సస్పెన్షన్ ఎత్తివేయకపోయినా సరే.. ప్రతిరోజూ అసెంబ్లీకి వస్తూ.. బయటే ఉండి ప్రభుత్వాన్ని తిట్టిపోస్తూ.. మీడియా దృష్టిని ఆకర్షించాలని రోజా నిర్ణయించుకున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.