వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా… పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై హైకోర్టుకు వెళ్లారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినా.. పెనమలూరు పోలీసులు పట్టించుకోలేదని.. కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని ఆమె.. పిటిషన్లో కోరారు. కొద్ది రోజుల కిందట.. ఎమ్మెల్యే రోజా.. పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సమయంలలో బోడె ప్రసాద్…” కాల్‌మనీ – సెక్స్ రాకెట్” కేసులో నిందితుడని రోజా విమర్శించారు. ఈ ఆరోపణలు ఆమె చాలా కాలం నుంచి చేస్తున్నారు. తనకు కాల్‌మనీతో కానీ.. సెక్స్ రాకెట్‌తో కానీ సంబంధం లేదని.. బోడె ప్రసాద్ అసెంబ్లీలోనే స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దన్నారు. కానీ రోజా మాత్రం.. ఆ కేసు పేరు కాస్త స్పైసీగా ఉందనుకున్నారో ఏమో కానీ.. బోడె ప్రసాద్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా.. అదేదో ఆయన ఇంటి పేరన్నట్లుగా చెప్పి… విమర్శలు చేయడం ప్రారంభించారు.
తన నియోజకవర్గానికి వచ్చి మరీ అలాంటి విమర్శలే చేయడంతో.. బోడె ప్రసాద్ కంట్రోల్ తప్పిపోయారు. రోజా పర్యటన ముగిసిన తర్వాత రోజు.. కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రోజా మాటలను తీవ్రంగా ఖండించారు. ఈ తీవ్రత హద్దులు దాటి పోయింది. దాచుకున్న కోపం అంతా ఒక్కసారిగా బయటకు రావడంతో.. రోజా కూడా బయటకు చెప్పుకోలేని విధంగా బోడె ప్రసాద్ విమర్శలు చేశారు. రోజా మాట్లాడే మాటలు.. సాధారణ మహిళలు మాట్లాడరని.. దానికి వేరే ఉంటారన్నట్లుగా విమర్శలు చేశారు. దీంతో వైసీపీలో గగ్గోలు రేగింది. దీనిపై రోజా బహిరంగంగా స్పందించలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం రోజా తరపున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రతిగా బోడె ప్రసాద్ అనుచరులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ రాజకీయ విమర్శల కేసుల జోలికి ఎందుకనుకున్నారేమో కానీ.. పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు.
కానీ రోజా మాత్రం వదిలి పెట్టదల్చుకోలేదు. బోడె ప్రసాద్ చేసిన విమర్శలు ఆన్లైన్లో వైరల్ కావడంతో.. ఆమె దీనిపై కచ్చితంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లున్నారు. కానీ రోజా పోరాటంపై కూడా.. ఆన్లైన్లో సెటైర్లు పేలుతున్నాయి. బోడె అన్న మాటలకు కేసు పెటాల్సి వస్తే.. రోజాపై రోజుకొకకసారి కేసు పెట్టాల్సి వస్తుందంటున్నారు. నగరిలో కొద్ది రోజుల కిందట.. పోలీసులపై ఆమె ప్రయోగించిన భాషను చూసి.. అందరూ అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది వైరల్. సాక్షాత్తూ ముఖ్యమంత్రినే “కామ సీఎం” అని విమర్శించిన ఘనత ఆమెది. అలాంటి ఆమె.. తనను అసభ్యంగా విమర్శించారని కోర్టుకు వెళ్తే.. ఆ విషయం తెలిసిన వారికి కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు అలానే ఉంది. తను ఏ మాత్రం కట్టుబాట్లు పెట్టుకోండా..నోటికొచ్చినట్లు విమర్శిస్తూ.. ఎదుటి వారు అలా అనుకూడదని అంటే.. ఎవరూ మద్దతుగా రారు. ప్రస్తుతం రోజా పరిస్థితి ఇదే.