నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .. నగరి నుంచి తరిమేస్తామని ప్రకటించారు. వీరంతా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు. పెద్దిరెడ్డి తనను గెలవకుండా చేస్తున్నారని తన వ్యతిరేకుల్ని ఆయనే పెంచి పోషిస్తున్నారని హైకమాండ్ కు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం రాలేదు. చివరికి తన అధికారంతో పెద్దిరెడ్డి అనుచరుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ప్రారంభించారు. దీంతో వారు మండిపోయి పార్టీకి గుడ్ బై చెప్పారు.
వరుసగా రెండు సార్లు గెలిచిన రోజా ఒకసారి వెయ్యి ఓట్లు.. మరోసారి రెండు వేల ఓట్లు లోపు తేడాతో గెలిచారు. అప్పట్లో రోజాపై ఇంత అసంతృప్తి లేదు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరికీ చాన్స్ లేకుండా తానే సంపాదించుకోవడంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. చివరికి లోకల్ పోల్స్ లో కూడా డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇవ్వడంతో అందరూ వ్యతిరేకమయ్యారు. ఐదు మండలాల్లో రోజాకు ఫ్లెక్సీ పెట్టే నేత కూడా లేరు. అయినా రోజా ఎప్పుడూ తగ్గలేదు. వ్యతిరేకుల్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయలేదు.
మొత్తంగా ఎన్నికలకు ముందు అందరూ బయటపడ్డారు. రోజా ఎలాగూ గెలవరు.. వైసీపీ రాష్ట్రంలో గెలవదని క్లారిటీ రావడంతో… రాజకీయం ప్రారంభించారు. అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. టీడీపీ లోకి వెళ్తామని ప్రకటించారు. రోజా మాత్రం ఇప్పటికీ చేయగలిగిందేమీ లేదని.. పథకాల లబ్దిదారులు పార్టీలతో సంబంధం లేకుండా ఓట్లేస్తారని ఆశ పడుతున్నారు.