నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి బలమైన నాయకుల్ని ఆమెకు వ్యతిరేకంగా కూటమి కట్టేలా చేయగలిగారు. ఇప్పుడు వారికి మరింత బలం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం నుంచి ఎంపీపీ అవ్వాలని రెడ్డివారి చక్రపాణి రెడ్డి అనే నేత తీవ్రంగా ప్రయత్నించారు.
ఆయనపై ఘాటు పదజాలంతో విరుచుకుపడిన రోజా.. చివరికి తాను అనుకున్న వ్యక్తికి పదవి ఇచ్చింది. ఇప్పుడు ఆమె ధాటికి తట్టుకోలేని ఐదు మండలాల నేతలు కలిసి కట్టుగా మారి పార్టీ కార్యక్రమాలను రోజాతో సంబంధం లేకుడా నిర్వహిస్తున్నారు. అలాంటి వారిలో ఇద్దరికి రాష్ట్రస్థాయి పదవులను హైకమాండ్ ప్రకటించారు. శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ పదవిని రెడ్డివారి చక్రపాణి రెడ్డికి ఇచ్చింది. ఇప్పటికే నగరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజీ కుమార్ సతీమణి శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది.
దీంతో రోజా వ్యతిరేక వర్గం బలం పుంజుకున్నట్లయింది. రోజాకు వ్యతిరేకంగా మంత్రి పెద్దిరెడ్డి వారందర్నీ ప్రోత్సహిస్తున్నారని రోజా వర్గీయులు అనుమానిస్తున్నారు. అది బహిరంగ రహస్యమేనని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ పెద్దిరెడ్డిని రాజకీయంగా రోజా ఎదుర్కోలేకపోతున్నారు.