జబర్దస్త్ షో చుట్టూ రేగిన వివాదాలు తక్కువేం కాదు. దీనిపై బూతు షో అనే ముద్ర పడింది. రోజా ఎక్కడకు వెళ్లినా.. `బూతు షోలను ఎంకరేజ్ చేస్తారేంటి?` అనే ప్రశ్న తరచూ ఎదురవుతోంది. ఓ ఎమ్మెల్యేగా, ప్రజా ప్రతినిధిగా ముఖ్యంగా మహిళగా.. జబర్దస్త్ లాంటి షో చేయడం రోజాని ఇబ్బంది పెట్టే విషయమే. ఇన్నాళ్లూ రోజా కూడా ఈ షోని సమర్థించుకొంటూ వస్తోంది. ఇక తన వల్ల కాదనుకొందేమో.. జబర్దస్త్‌కి గుడ్ బాయ్ చెప్పాలన్న నిర్ణయం తీసుకొంది. అవును.. రోజా ఇక నుంచి జబర్దస్త్ పోగ్రాంలో కనిపించదట. అంతేకాదు… రచ్చబండ పోగ్రాం నుంచి కూడా బయటకు వచ్చేస్తోందని తెలుస్తోంది. అయితే… రోజా మాత్రం ఇప్పటికీ ఆ రెండు కార్యక్రమాల్నీ సమర్థించుకొంటూనే ఉంది. `జబర్దస్త్ బూతు పోగ్రాం కాదు. కుటుంబ ప్రేక్షకులూ ఎంజాయ్ చేస్తున్నారు. జబర్ దస్త్ చూసేవాళ్లలో చదువుకొన్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది` అంటూ లెక్కలు తీస్తోంది. అంతేకాదు… ‘ఆ కార్యక్రమం ఈటీవీలో ప్రసారం అవుతోంది. ఆ టీవీ రామోజీరావుది. ఆయన్ని వదిలేసి రోజాని అంటారేంటి’ అంటూ లా పాయింట్ లాంగింది.
రోజా అన్నమాటల్లోనూ నిజం ఉంది. ఎవరైతే జబర్దస్త్, పటాస్ లాంటి షోల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే టీవీ ఛానళ్లలో గంటలు గంటలు కొంతులు అరిగిపోయేలా అరచుకొంటున్నారో… వాళ్లంతా రోజాని తప్పుపడుతున్నారే తప్ప.. ఈటీవీని నడిపిస్తున్న రామోజీ రావుని పల్లెత్తు మాట అనే ధైర్యం చేయలేకపోతున్నారు. జబర్దస్త్ నుంచి రోజా బయటకు వచ్చేస్తే.. అప్పుడు కూడా ఆ షోని చీల్చి చండాడుతారా? లేదంటే రోజా వచ్చేసింది కదా అని వదిలేస్తారా?? అనేది తెలియాల్సివుంది. రోజా గైర్హాజరుతో… జబర్ దస్త్ లో మరో జడ్జ్‌ని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ షోకి మరో నటీమణిని తీసుకురావాలని ప్రయత్నాలు మొదలైపోయాయి. ఈ షో లో నాగబాబు మాత్రం కొనసాగుతారని తెలుస్తోంది.