రాజకీయ పార్టీల అధినేతలందరూ కూడా రోజాలాంటి నేత మా పార్టీలో కూడా ఉండాలి అని కోరుకునేంత హార్డ్ వర్కర్ రోజా. అతిగా ఆవేశపడుతూ, అతిగా మాట్లాడేస్తూ తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకుని మరీ అధినేతను గొప్పవాడిని చేయాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ఈ విషయంలో రోజా చిత్తశుద్ధిని అస్సలు శంకించలేం. టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబును సపోర్ట్ చేస్తూ రోజా పడిన కష్టం అంతా ఇంతా కాదు. వైఎస్సార్ లాంటి స్ట్రాంగ్ లీడర్ని కూడా ఉతికి ఆరేసింది రోజా. అలాగే తనతో కలిసి నటించిన మెగాస్టార్ చిరంజీవిని కూడా వదిలిపెట్టలేదు రోజా. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ విషయంలో కూడా అదే చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తోంది రోజా. మామూలుగా అయితే మన దగ్గర ఉన్న ఎక్కువ మంది రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళతోనూ మిత్రులుగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకటి ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ చేయాల్సి వస్తుందో వాళ్ళకే తెలియదు కాబట్టి. ఇక రెండో విషయం ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తాము ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్ధేశ్యంతో అందరితోనూ మంచి సంబంధాలనే మెయింటెయిన్ చేస్తూ ఉంటారు. కానీ తాను ఉన్న పార్టీలో తప్ప మిగతా అన్ని పార్టీల నాయకులతోనూ గొడవలు పెట్టుకుంటూ పార్టీ ప్రయోజనాల కోసం, అధినేత గొప్ప కోసం తాపత్రయపడే రోజాలాంటి నేత ఏ పార్టీకైనా బలమే. కానీ రోజా నోటి దురుసు వళ్ళ….ఆమె మాటలన్నీ చాలా సార్లు రివర్స్ అవుతూ ఉంటాయి.
బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడం కోసం హాస్పిటల్‌కి వెళ్ళిన జగన్ అక్కడ కాస్త ఓవర్ యాక్షనే చేశాడు. ఆవేధన ఉంటే ఉండొచ్చు కానీ ఆవేశంతో మాట్లాడిన జగన్ మాటలను మాత్రం టిడిపి నాయకులు విమర్శల చాకిరేవులో వేసి ఉతికి ఆరేశారు. కానీ సాక్షి మీడియాతో పాటు వైకాపా నాయకులందరూ కూడా జగన్ మాటలను సమర్థించడానికి చాలా పాట్లే పడ్డారు. మరీ ముఖ్యంగా సాక్షి మీడియాలో అయితే…బాధితులకు అన్యాయం చేసినవాళ్ళను శిక్షిస్తా అని జగన్ మాట్లాడాడు అన్నంత సాఫ్ట్‌గా ఆ వార్తను వండివార్చారు. కానీ రోజా మాట్లాడిన మాటల దెబ్బకు వాళ్ళ ప్రయత్నాలన్నీ వృథా అయిపోయాయని వైకాపా నాయకులే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్…జగన్ మాట్లాడిన ఆ వీడియోలను పదే పదే చూపించొద్దు..అని మీడియాని రిక్వెస్ట్ చేసింది రోజా. అక్కడే అడ్డంగా బుక్కయిపోయింది. మీడియాని రోజా రిక్వెస్ట్ చేసిన విధానం చూసినవాళ్ళకు ఎవ్వరికైనా జగన్ తప్పుగా మాట్లాడాడన్న విషయం అర్థమయిపోయేలా ఉంది. మా అధినేత ఏదో తప్పుగా మాట్లాడాడు…మీరు ఆ మాటలను హైలైట్ చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేసినట్టుగానే ఉన్నాయి రోజా మాటలు. బస్సు ప్రమాద ఘటనలో బాధితులకు న్యాయం చేసేలా చంద్రబాబు ప్రభుత్వ చర్యలు అస్సలు లేవు అన్న విషయం నిజమే అయినప్పటికీ జగన్ రియాక్షన్ కూడా ప్రతిపక్ష నాయకుడి స్థాయికి తగ్గట్టుగా లేదన్నది నిజం. ఆ విషయం ఆ పార్టీనేత రోజాకు కూడా అర్థమయింది. వైఎస్ జగన్ కూడా తన తప్పులను తెలుసుకుని కాస్త హుందాగా రియాక్ట్ అవ్వడం నేర్చుకుంటే ఆయన ఇమేజ్‌కే అది ప్లస్ అవుతుంది.