వైకాపా ఎమ్మెల్యేఆర్.కె.రోజాకి వరుసగా హైకోర్టులో, సుప్రీం కోర్టులో కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. ఆమె 2014లో చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అదే జిల్లాకి చెందిన రాయుడు అనే వ్యక్తి ఆమె ఎన్నికపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ అది చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని హైకోర్టు విచారణకి స్వీకరించి రోజాకి నోటీసు జారీ చేసింది. రాయుడు వేసిన పిటిషన్ కొట్టివేయాలని కోరుతూ రోజా మరొక పటిషన్ వేశారు. హైకోర్టు ఆమె పిటిషన్ని కూడా విచారణకి స్వీకరించింది. రెంటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని వాయిదా వేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేయగా అక్కడా ఆమెకి ఎదురుదెబ్బే తగిలింది. ప్రస్తుతం ఈ కేసుని హైకోర్టు విచారిస్తోంది కనుక మళ్ళీ హైకోర్టుకే వెళ్ళవలసిందిగా రోజాకి సూచించింది. అయితే ఈ కేసుపై విచారణని ఈ ఏడాది డిశంబర్లోగా పూర్తిచేయమని హైకోర్టుని ఆదేశించింది. అదొక్కటే ఆమెకి కొంత ఊరటనిచ్చే విషయం. అయితే ప్రస్తుతం తెలంగాణా న్యాయవ్యవస్థ చాలా సంక్షోభంలో కూరుకుపోయున్నందున ఆమె కేసు పరిష్కారం కావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.